ముంబై: న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో చివరి రెండు వన్డేల నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించారు. ట్వంటీ20 సిరీస్ నుంచి కూడా విశ్రాంతి కల్పించారు. విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహిస్తాడు.

ఆ మేరకు బిసిసిఐ ఓ ప్రకటన విడుదల చేసింది. కొద్ది నెలలుగా అతనిపై పడిన వర్క్ లోడ్ ను తగ్గించడానికి ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే సిరీస్ ను దృష్టిలో ఉంచుకుని కోహ్లీకి తగిన విశ్రాంతి కల్పించడం అవసరమని టీమ్ మేనేజ్ మెంట్, సీనియర్ సెలెక్షన్ కమిటీ అభిప్రాయపడినట్లు ఆ ప్రకటనలో వివరించారు. 

విరాట్ కోహ్లీ స్థానంలో మరో ఆటగాడిని జట్టులో చేర్చడం లేదని, కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహిస్తాడని తెలిపింది. తొలి వన్డేలో విజయం సాధించి విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ కు భారత్ విజయం సాధించగలదనే ధీమాను కల్పించాడు. 

ఆస్ట్రేలియా పర్యటనకు ముందు వెస్టిండీస్ తో జరిగిన టీ20 సిరీస్ సమయంలో కూడా కోహ్లీకి విశ్రాంతి కల్పించారు. మే - జులైల్లో ప్రపంచ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు తీరిక లేని విధంగా క్రికెట్ సిరీస్ ల్లో మునిగిపోయింది.