కాఫీ విత్ కరణ్ షో లో మహిళలను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీంఇండియా యువ క్రికెటర్లు హార్ధిక్ పాండ్యా, కేఎల్.రాహుల్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే హర్దిక్ పాండ్యా చేసిన తప్పుకు  కెఎల్. రాహుల్ బలికావాల్సి వచ్చింది. కేవలం పాండ్యాతో కలిసి ఆ షోలో పాల్గొన్నందుకే రాహుల్ పై బిసిసిఐ వేటు వేసింది. ఈ వివాదం, బిసిసిఐ నిషేదం నుండి ఇటీవలే బయటపడ్డ రాహుల్ తన ఉధారతను చాటుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అతడి చికిత్స కోసం రాహుల్ భారీగా ఆర్థిక సాయం చేసి తన ఉదారతను చాటుకున్నాడు. ఇప్పటివరకు తన భర్త  చికిత్స కోసం చాలా మంది ఆటగాళ్లు ఆర్థిక సాయం చేశారని...అయితే వారందరిలో రాహుల్ చేసిన సాయం చాలా విలువైనదని మార్టిన్ భార్య ఖ్యాతి తెలిపారు. 

మార్టిన్ ఆరోగ్య పరిస్ధితి గురించి తెలుసుకున్న రాహుల్ చికిత్స కోసం మొత్తం ఎంత డబ్బులు కావాలని తమను అడిగాడని  ఖ్యాతి తెలిపింది.  అయితే తాము ఎంత అవసరమో తెలియజేయగా సాయంత్రం లోపే తమ ఖాతాలో రాహుల్ డబ్బులు జమ చేశాడని తెలిపింది. ఇలా తమ కుటుంబాన్ని ఆదుకున్న రాహుల్ తో పాటు మిగతా అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు మార్టిన్ భార్య వెల్లడించారు.  

1999లో విండీస్‌తో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన జాకబ్ మార్టిన్ 10 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత మళ్లీ అంతర్జాతీయ జట్టులో స్థానం సంపాదించలేకపోయినా బరోడా జట్టు తరపున రంజీ మ్యాచులు ఆడాడు. అయితే 2007 డిసెంబర్ 28న జరిగిన రోడ్డు ప్రమాదంలో జాకబ్ తీవ్రంగా గాయపడ్డాడు. కాలేయం, ఊపిరితిత్తులకు తీవ్రగాయాలయ్యాడు. అయితే అప్పటినుండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మార్టిన్ వైద్యానికయ్యే ఖర్చులను భరించలేని స్థితిలో వున్న కుటుంబానికి బిసిసిఐ తో పాటు మాజీ, ప్రస్తుత  క్రికెటర్లు ఆదుకున్నారు.