Kho Kho World Cup 2025 Final: ప్రియాంక ఇంగ్లే నాయకత్వంలోని భారత మహిళా జట్టు ఖో ఖో ప్రపంచ కప్ 2025లో వరుస విజయాలతో ఫైనల్ కు దూసుకెళ్లింది. 

Kho Kho World Cup 2025 Final: ఖో ఖో ప్రపంచ కప్ లో భారత మహిళలు, పురుషుల జట్లు తమ జైత్ర యాత్రను కొనసాగిస్తున్నాయి. రెండు జట్లు ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఒక్క ఓటమి లేకుండా తిరుగులేని టీమ్స్ గా కొనసాగుతున్నాయి. ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత మహిళా జట్టు ఖో ఖో ప్రపంచ కప్ 2025 ఫైనల్‌కు చేరుకుంది. ప్రియాంక ఇంగ్లే నాయకత్వంలోని జట్టు క్వార్టర్ ఫైనల్‌తో సహా వరుసగా ఐదు మ్యాచ్‌లలో విజయం సాధించి అజేయంగా కొనసాగుతోంది. 

మొదటి నుంచి ఆధిపత్యం కొనసాగిస్తున్న భారత జట్టు 

ఖోఖో ప్రపంచ కప్ 2025 లో భారత టోర్నీ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన చేస్తోంది. సెమీ ఫైనల్ మ్యాచ్ లో దుమ్మురేపింది. భారత మహిళల దెబ్బకు సౌతాఫ్రికా నిలబడలేకపోయింది. టాస్ గెలిచిన భారత్ మొదటి టర్న్‌లో దక్షిణాఫ్రికాపై అటాక్ చేయాలని నిర్ణయించుకుంది. ఇరు జట్ల నుంచి పోటాపోటీ పోరాటం కనువిందు చేసింది. ప్రియాంక ఇంగ్లే నాయకత్వంలోని జట్టు డిఫెండింగ్ర కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దక్షిణాఫ్రికా కీలక పాయింట్లు సాధించింది. స్కోరు 10-5తో 5 పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. 

రెండో టర్న్‌లో దాడి చేసిన భారత మహిళా జట్టు పుంజుకుంది. భారత దాడి చేసే ఆటగాళ్లు దక్షిణాఫ్రికా రక్షణ ఆటగాళ్లకు గట్టి పోటీనిచ్చారు. మొదటి అర్ధభాగం ముగిసే సమయానికి భారత మహిళా జట్టు 33-10తో 23 పాయింట్ల ఆధిక్యంలో ఉంది.

Scroll to load tweet…

మూడో టర్న్‌లో దక్షిణాఫ్రికా అటాక్ చేసే ఆటగాళ్లు తమ ప్రతిభను చూపించాల్సి వచ్చింది. అయితే, భారత డిఫెండింగ్ చాలా బలంగా ఉంది. ఈ క్రమంలో ఒక ఆటగాడికి చీలమండ గాయమైంది. 3వ టర్న్ ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా మరో ఆరు పాయింట్లు సాధించి 16 పాయింట్లకు చేరుకుంది. భారత్ 36-16తో 20 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. 

చివరి టర్న్‌లో భారత్ దాడిని మళ్లీ ప్రారంభించి దక్షిణాఫ్రికా జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడిని ఔట్ చేసింది. సెమీఫైనల్లో భారత్ 66-16తో 50 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నమెంట్‌లో మొదటిసారిగా భారత మహిళా జట్టు 100 పాయింట్లు లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు సాధించలేకపోయింది. 

ఫైనల్ లో నేపాల్ తో తలపడనున్న భారత మహిళా జట్టు 

మహిళల విభాగంలో జరిగిన తొలి సెమీఫైనల్లో నేపాల్ బలహీనమైన ఉగాండా జట్టును 89-18తో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. నేపాల్ అటాకర్స్, డిఫెండర్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు నేపాల్ కూడా అద్భుతమైన ఆటతో అదరగొడుతోంది. జనవరి 19 ఆదివారం ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగే టైటిల్ పోరులో నేపాల్‌తో తలపడనున్న భారత మహిళా జట్టు తొలి ఖో ఖో ప్రపంచ కప్ ఛాంపియన్‌గా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రియాంక ఇంగ్లే నాయకత్వంలోని భారత జట్టు జోరు చూస్తే తొలి ఖో ఖో ప్రపంచ కప్ 2025 టైటిల్ ను అందుకోవడం పక్కాగా కనిపిస్తోంది.