అలా గెలిస్తే, మా అమ్మ ఏమనుకుంటుంది... బౌండరీ లైన్ దగ్గర ఆగిపోయిన రన్నర్...
సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న 2012 లండన్ ఒలింపిక్స్‌లో జరిగిన ఓ సంఘటన...
టోక్యో ఒలింపిక్స్ 2020 గేమ్స్, స్పోర్ట్స్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాను అందిస్తున్నాయి. ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్న ఈ సమయంలో 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఓ సంఘటనకు సంబంధించిన న్యూస్, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...
3000 మీటర్ల రన్నింగ్ ఈవెంట్‌లో కెన్యా రన్నర్ అబెల్ ముటాయ్, ఫినిషింగ్ లైన్‌కి 10 మీటర్ల దూరంలో రేసు ముగిసిపోయిందని భావించి, స్లో అయిపోయాడు. అతని వెనకాలే ఉన్న స్పెయిన్‌కి చెందిన ఇవాన్ ఫెర్నాండేజ్, అబెల్ ముటాయ్‌ని గమనించాడు. రేసు ఫినిషింగ్ లైన్ ఇంకా 10 మీటర్ల దూరంలో పరుగెత్తాలని స్పానిష్‌లో అరిచాడు...
అయితే కెన్యా రన్నర్‌కి స్పానిష్ రాకపోవడంతో అతనేం అంటున్నాడో అర్థం కాలేదు. దీంతో ఫెర్నాండేజ్... అబెల్ ముటాయ్‌ని పట్టుకుని ముందుకు వెళ్లమంటూ ఫినిషింగ్ లైన్ చూపించాడు.
మూడో స్థానంలో ఉన్న అబెల్ ముటాయ్ రేసును పూర్తి చేసి, కాంస్య పతకం గెలవగా, అతని వెనకాలే వచ్చిన ఫెర్నాండేజ్ నాలుగో స్థానంలో రేసును ముగించడంతో పతకం రాలేదు...పతకం గెలవలేకపోయినా, తన పోటీదారుడిని గెలిపించి, అందరి మనసులు గెలుచుకున్నాడు ఫెర్నాండేజ్.
పతకం గెలిచిన అబెల్ ముటాయ్, ఇవాన్ ఫెర్నాండేజ్‌ను హత్తుకుని, కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సంఘటన తర్వాత రిపోర్టర్ ఈ విషయం గురించి అతన్ని ప్రశ్నించింది... ‘మీరు ఎందుకిలా చేశారు’ అని రిపోర్టర్ అడగగా, ‘నేనేం చేయలేదు. కేవలం అతనికి విషయం చెప్పానంతే...’ అన్నాడు ఫెర్నాండేజ్.
‘కెన్యా అథ్లెట్‌ని ఎందుకు గెలవనిచ్చారు?’ అని అడగగా... ‘నేను అతన్ని గెలిపించలేదు. అతను గెలిచేవాడు. అతను ముందున్నాడు...’ అని చెప్పాడు ఫెర్నాండేజ్. మళ్లీ రిపోర్టర్ ‘మీరు కావాలంటే ముందుకు వెళ్లి, గెలిచి ఉండొచ్చు కదా...’ అని అడగ్గా...
‘అలా గెలిస్తే, నా విజయానికి అర్థం ఏముంటుంది? ఆ మెడల్‌కి గౌరవం ఏముంటుంది? మా అమ్మ నా గురించి ఏమనుకుంటుంది...’ అంటూ సమాధానం ఇచ్చాడు ఫెర్నాండేజ్. చేసిన పని కంటే, ఇంకా మంచి మాటలతో అందరి మన్ననలు దక్కించుకున్నాడు ఇవాన్ ఫెర్నాండేజ్...