టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై మరో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ మధ్యకాలంలో  ధోని ఆటతీరు సరిగా లేదని.. అతను ఫామ్ కోల్పోయాడంటూ కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి. కాగా.. ఈ కామెంట్స్ పై కపిల్ దేవ్ స్పందించారు.

‘‘ ధోనీ నుంచి అందూ ఏం ఆశిస్తున్నారో అర్థం కావడం లేదు. ఆయనేమీ 20ఏళ్ల కుర్రాడు కాదు కదా. నిజంగా ధోనీ ఆ వయసులో ఉన్నప్పుడు ఆట ఎలా ఆడాడో అందరికీ తెలుసు. మనమంతా చూశాం కూడా. ఇప్పుడు కూడా ఆయన నుంచి అదే ఆట ఆశించడం తప్పు.  కానీ.. ధోనికి ఉన్న అనుభవం టీం ఇండియాకి ఉపయోగపడుతుంది. టీం ఇండియాకి దొరికిన విలువైన ఆస్తి ధోని. కెప్టెన్ గా ఉన్న సమయంలో క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు జట్టుకి బాగా ఉపయోగపడ్డాయి. జట్టును బాగా నడిపించారు.’’ అంటూ కపిల్ దేవ్ ధోనికి మద్దతుగా నిలిచారు.

ఇక విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. ‘‘ అనుభవం, టాలెంట్ రెండు కలిస్తే కోహ్లీ. అతను చాలా స్పెషల్ పర్సన్. గేమ్ కూడా చాలా ప్రత్యేకంగా ఆడతాడు. కష్టపడే తత్వం ఎక్కువ. మ్యాచ్ గెలవడం, ఓడటం ముఖ్యం కాదు. గేమ్ ఎలా ఆడారు అనేది ముఖ్యం’’ అని కోహ్లీ గురించి చెప్పుకొచ్చారు.