సిగ్గుచేటు..! భావి భారత ఆటగాళ్లకు టాయ్‌లెట్‌లో భోజనం.. యూపీ ఘటనపై వెళ్లువెత్తుతున్న ఆగ్రహం
Kabaddi Players Served Food In Toilet: అసలే దేశంలో సౌకర్యాల కొరతతో కొట్టుమిట్టాడుతున్న క్రీడాకారులకు తినే తిండి కూడా సక్రమంగా అందడం లేదు. కాంట్రాక్టర్ల ధనదాహానికి పేద క్రీడాకారులు టాయ్‌లెట్‌లో భోజనం చేయాల్సి వస్తున్నది.
ఒలింపిక్స్‌లో భారత్ ఎందుకు విజయవంతం కావడం లేదు..? అని ప్రతి నాలుగేండ్లకోసారి విశ్లేషణలు, విమర్శలు చేసుకునే భారత్‌లో క్రీడాకారులకు కనీస సౌకర్యాలు లేవన్న కఠోర వాస్తవాన్ని ఒప్పుకోవడానికి రాజకీయ నాయకులకు, క్రీడాశాఖ పెద్దలకు, ప్రభుత్వాధికారులకు మనసు అంగీకరించదు. కానీ అదే వాస్తవం. మైదానాలలో వసతుల సంగతి అటుంచితే కనీసం ఆట ఆడటానికి వచ్చిన క్రీడాకారులకు సరైన తిండి కూడా పెట్టలేని దుస్థితిలో ప్రభుత్వాలు, క్రీడా సంస్థలున్నాయంటే అతిశయోక్తి కాదు. ఉత్తరప్రదేశ్ లో కబడ్డీ ఆటగాళ్లకు జరిగిన ఘటనే ఇందుకు సజీవ సాక్ష్యం. కబడ్డీ ఆడటానికి వచ్చిన అండర్-17 బాలికలకు టాయ్‌లెట్‌లో భోజనం పెట్టిన ఘటనపై దేశవ్యాప్తంగా క్రీడాకారుల్లో ఆగ్రహం వెల్లువెత్తుతున్నది.
అసలు విషయంలోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని సహ్రాన్‌పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 16 నుంచి 18 వరకు అక్కడ అండర్ -17 బాలికల కబడ్డీ పోటీలు జరిగాయి. సుమారు 16 డివిజన్ల నుంచి 200 మంది బాలికలు (17 టీమ్స్) ఈ పోటీలలో పాల్గొనడానికి వచ్చారు.
అయితే బాలికలకు మధ్యాహ్నం భోజనం అందించింది పురుషుల టాయ్‌లెట్‌లో.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఈ వీడియో క్రీడా లోకంలోనే గాక రాజకీయ రంగు కూడా పులుముకుంది. యూపీ బీజేపీ నాయకుడు, పిలిబిత్ ఎంపీ వరుణ్ గాంధీ ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ‘సిగ్గు చేటు’ అని కామెంట్ చేశాడు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘మన క్రీడాకారులతో వ్యవహరించే పద్ధతి ఇదేనా..? ఇలా అయితే వాళ్లు ఒలింపిక్స్ వెళ్లి పతకాలు ఎలా తెస్తారు..? ఇండియా స్పోర్ట్స్ లో నెంబర్ వన్ ఎప్పుడవుతుంది..?’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
వీడియో వైరల్ అవడం, రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాలికలకు భోజనం తీసుకువచ్చిన కాంట్రాక్టర్ ను వెంటనే సస్పెండ్ చేసినట్టు యూపీ స్పోర్ట్స్ అడిషినల్ చీఫ్ సెక్రటరీ నవనీత్ సెగాల్ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు ఆయన చెప్పారు. భవిష్యత్ లో మళ్లీ ఇలాంటి ఘటనలు జరుగకుండా చూసుకుంటామని తెలిపారు.
ఇక ఈ ఘటనపై జాతీయ మీడియాలో చర్చలు జరిగాయి. యూపీ ఘటనతో పాటు ఇటీవలే డ్యూరండ్ కప్ ఫైనల్ లో భారత ఫుట్బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రిని బెంగాల్ గవర్నర్ లా గణేషన్ ఫోటోలకోసం పక్కకు నెట్టేయడం గురించి టీవీ ఛానెళ్లు చర్చోపచర్చలు జరుగుతున్నాయి. క్రీడలలో రాజకీయ జోక్యం తగ్గినప్పుడే ఈ దేశం క్రీడల్లో ముందుకెళ్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఖేలో ఇండియా, కబడ్డీ ప్రో లీగ్, ఐఎస్ఎల్ వంటి లీగ్ లు ఎన్నివచ్చినా రాజకీయ జోక్యం కనుమరుగై అసలైన క్రీడాకారులకు అవకాశాలు దక్కినప్పుడే క్రీడల్లో భారత్ ముందుకెళ్తుందని విశ్లేషిస్తున్నారు.