Asianet News TeluguAsianet News Telugu

రికార్డుల ‘జ్యోతి’... యూకేలో తన రికార్డును తానే బ్రేక్ చేసిన తెలుగమ్మాయి...

 వుమెన్స్ 100 మీటర్ల హర్డెల్ నేషనల్ రికార్డును రెండోసారి తిరగరాసిన జ్యోతి ఎర్రాజీ... యూకేలో జరుగుతున్న లాగ్‌బోరోగ్ ఇంటర్నేషనల్ అథ్లెట్స మీట్‌లో 13.11 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి సరికొత్త రికార్డు...

Jyothi Yerraji Creates new National record after breaking her own Record
Author
India, First Published May 23, 2022, 5:09 PM IST

భారత అథ్లెట్, 22 ఏళ్ల తెలుగమ్మాయి జ్యోతి ఎర్రాజీ.. వుమెన్స్ 100 మీటర్ల హర్డెల్ నేషనల్ రికార్డును రెండోసారి తిరగరాసింది. రెండు వారాల క్రితం తానే క్రియేట్ చేసిన నేషనల్ రికార్డును తిరగరాసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది... యూకేలో జరుగుతున్న లాగ్‌బోరోగ్ ఇంటర్నేషనల్ అథ్లెట్స మీట్‌లో పాల్గొంటున్న జ్యోతి ఎర్రాజీ, ఆదివారం 13.11 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

మే 10న లిమసోల్‌లో జరిగిన సిప్రస్ ఇంటర్నేషనల్ మీట్‌లో 13.23 సెకన్లలో 100 మీటర్ల హర్డెల్‌ను పూర్తి చేసి, నేషనల్ రికార్డు క్రియేట్ చేసింది జ్యోతి... రెండు వారాల వ్యవధిలో సెకనుకి +0.3 మీటర్ల వేగాన్ని పెంచిన జ్యోతి, 0.12 సెకన్ల సమయంలో లక్ష్యాన్ని అందుకుంది...

ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన జ్యోతి ఎర్రాజీ, ఒడిస్సాలోని భువనేశ్వర్‌లో గల రిలయెన్స్ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలోని అథ్లెటిక్స్ హై పర్ఫామెన్స్ సెంటర్‌లో శిక్షణ పొందింది.ఇంతకుముందు 2002లో 100 మీటర్ల హర్డెల్‌ని  13.38 సెకన్లలో అందుకున్న అనురాధ బిస్మాల్‌‌దే జాతీయ రికార్డుగా ఉండేది. 20 ఏళ్ల తర్వాత ఆ రికార్డును బ్రేక్ చేసిన జ్యోతి ఎర్రాజీ, రెండు వారాల వ్యవధిలో తన రికార్డును మరింత మెరుగుపర్చుకుంటూ సరికొత్త నేషనల్ రికార్డును సృష్టించింది...

కోజికోడ్‌లో జరిగిన ఫెడరేషన్ కప్‌లో జ్యోతి ఎర్రాజీ 13.09 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ఆ సమయంలో గాలి వేగం సెకనుకి +2.1 మీటర్లుగా ఉండడంతో జ్యోతి ఎర్రాజీ రికార్డును లెక్కలోకి తీసుకోలేదు. అథ్లెటిక్స్‌లో గాలి వేగం సెకనుకి +2 మీటర్ల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని అనుమతించరు. 

2020లో కర్ణాటకలోని మూడ్‌బిద్రీలో జరిగిన ఆల్ ఇడియా ఇంటర్ యూనివర్సటీ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లోనూ  అనురాధ బిస్మాల్ రికార్డును ఛేదించింది జ్యోతి. 13.03 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. అయితే అప్పుడు కూడా జ్యోతి రికార్డును లెక్కలోకి తీసుకోలేదు అధికారులు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన టెక్నికల్ సిబ్బంది ఈ ఈవెంట్‌కి రాకపోవడం, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అధికారులు జ్యోతి శాంపిల్స్‌ని పరీక్షించకపోవడంతో జ్యోతి రికార్డును లెక్కలోకి తీసుకోలేదు...

అలా జాతీయ రికార్డులు నెలకొల్పే అవకాశాన్ని రెండు సార్లు మిస్ చేసుకున్న జ్యోతి ఎర్రాజీ, రెండు వారాల వ్యవధిలో రెండు సరికొత్త రికార్డులు సృష్టించింది. జ్యోతి ఎర్రాజీ తండ్రి సూర్యనారాయణ ఓ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు. ఆమె తల్లి గృహిణి. కడు పేదరికం నుంచి వచ్చిన జ్యోతి ఎర్రాజీ, పరుగుల ప్రపంచంలో పతకాల వేటను రికార్డులతో ప్రారంభించింది... 

Follow Us:
Download App:
  • android
  • ios