Taiwan Athletics Open 2024: తైవాన్ అథ్లెటిక్ ఓపెన్‌లో తెలుగు తేజం జ్యోతి యర్రాజీ 100మీ హర్డిల్స్‌లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఈ ఈవెంట్ లో భారత్ మొదటి రోజే నాలుగు స్వర్ణాలు గెలుచుకుంది.
Jyothi Yarraji: చైనీస్ తైపీ వేదికగా జరుగుతున్న తైవాన్ అథ్లెటిక్ ఓపెన్ 2025 ప్రారంభ రోజు భారత అథ్లెట్లు సత్తా చాటారు. శనివారం జరిగిన పోటీలలో భారత జట్టు నాలుగు స్వర్ణ పతకాలు సాధించింది. వీటిలో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో తెలుగు తేజం జ్యోతి యర్రాజీ అద్భుతమైన ప్రదర్శనతో గోల్డ్ మెడల్ గెలుచుకుంది.
తెలుగు తేజం జ్యోతి యర్రాజీకి గోల్డ్ మెడల్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి యర్రాజీ 12.99 సెకన్లతో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో విజయం సాధించింది. ఫైనల్లో జపాన్ అథ్లెట్ చిసాటో కియాయామా దూసుకెళ్తున్న వేళ, చివరి హర్డిల్ దగ్గర అద్భుతంగా ఫినిష్ చేసి జ్యోతి గోల్డ్ ను కైవసం చేసుకుంది. ఇది ఆమెకు గత 15 రోజుల్లో రెండవ గోల్డ్ మెడల్ కావడం విశేషం. ట్రయల్స్‌లో 13.18 సెకన్లతో ఫస్ట్‌గా నిలిచిన ఆమె, ఆ తర్వాత కూడా సత్తా చాటింది.
తైవాన్ అథ్లెటిక్ ఓపెన్ 2025 భారత్ జోరు
తైవాన్ అథ్లెటిక్ ఓపెన్ 2025 మొదటి రోజు జ్యోతి యర్రాజీతో పాటు మహిళల 1500 మీటర్ల ఈవెంట్‌లో పూజా 4:11.63 సెకన్లతో కొత్త ఛాంపియన్‌షిప్ రికార్డుతో గోల్డ్ గెలిచింది. గత నెల గుమిలో జరిగిన ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె ఇదే ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకుంది. ట్రిపుల్ జంప్‌లో అబ్దుల్లా అబూబకర్ మూడవ ప్రయత్నంలో 16.21 మీటర్ల దూకుడుతో గోల్డ్ మెడల్ గెలిచాడు.
పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో తేజస్ శిర్షే సీజన్ బెస్ట్ 13.52 సెకన్ల టైమింగ్‌తో గోల్డ్ సాధించాడు. రన్నింగ్ సమయంలో ఒక హర్డిల్‌తో తగిలినా కూడా అతను తన దూకుడును కొనసాగించాడు.
ఎవరీ జ్యోతి యర్రాజీ?
భారత అథ్లెటిక్స్‌లో వేగంగా ఎదుగుతున్న యంగ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ. ఆమె ప్రయాణం ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ కు చెందిన జ్యోతి 2024 పారిస్ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించింది.
జ్యోతి తండ్రి సూర్యనారాయణ ఒక ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంటే, తల్లి గృహ సహాయకురాలిగా పని చేస్తారు. ఈ నేపథ్యంలో పెరిగిన జ్యోతి, విశాఖపట్నంలోని పోర్ట్ హై స్కూల్‌లో ప్రాథమిక విద్యను పూర్తిచేసింది. ఆ తరువాత ఆమె అచార్య నాగార్జున యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించింది. జ్యోతి అథ్లెటిక్స్ పట్ల ఆసక్తిని చిన్న వయస్సులోనే చూపింది.
2022లో అనురాధ బిస్వాల్ పేరిట ఉన్న జాతీయ రికార్డును బద్దలుకొట్టి 13.23 సెకన్లతో కొత్త రికార్డు నమోదు చేసింది. ఆ తర్వాత పలు సార్లు తనే సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ప్రస్తుతం ఆమె భువనేశ్వర్‌లో రిలయన్స్ హై-పర్‌ఫార్మెన్స్ సెంటర్‌లో బ్రిటీష్ కోచ్ జేమ్స్ హిల్లియర్ శిక్షణలో ఉంది. చిన్నవయసులోనే ఆమె సామాన్య కుటుంబం నుండి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో భారత పేరు నిలబెట్టడం విశేషం.
