అబుదాబి: ఐపిఎల్ సీజన్ 13 లీగ్ దశలో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్ ద్వారా తేలింది.  ఇలాంటి ఉత్కంఠభరిత మ్యాచ్ లో కూడా అభిమానుల కళ్లు మైదానంలోని ఆటగాళ్ల కంటే అంఫైర్ నే ఎక్కువగా ఫోకస్ చేశాయి. ఐపిఎల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఓ మహిళా అంపైర్ మైదానంలో అడుగుపెట్టిందని అనుకున్నారంతా. అయితే అక్కడుకున్న మహిళ కాదు పురుషుడే అని తెలిసి ఆశ్చర్యపోవడం అభిమానుల వంతయ్యింది. 

మహిళా అంపైర్ గా అభిమానులు భ్రమపడిన అంపైర్ పైరు పశ్చిమ్ పాఠక్. అందరు అంపైర్లలా కాకుండా కాస్త విభిన్నంగా కనిపించాలని భావించాడో ఏమో గాని లాంగ్ హెయిర్ పెంచాడు. దీంతో నిన్నటి మ్యాచ్ లో అంపైరింగ్ చేస్తుండగా జుట్టు భుజాలపైకి వాలి అచ్చం మహిళలా కనిపించాడు. దీంతో ఓ మహిళా అంపైర్ చేస్తున్నట్లు అనిపించింది. ప్రస్తుతం పాఠక్‌ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేయడం మొదలుపెట్టాయి.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే  చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి స్కోర్లు టైగా ముగిడయంతో సూపర్ ఓవర్‌కి దారి తీసింది. సూపర్ ఓవర్‌లో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్‌కి 3 పరుగుల టార్గెట్ ఇచ్చింది. నాలుగు బంతుల్లో 3 పరుగులు చేసి ఈజీ విక్టరీ సాధించింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. 

టాస్ గెలిచి ప్రత్యర్థికి ఫీల్డింగ్ అందించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కి మంచి షాక్ ఇచ్చారు సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్. 164 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆరంభంలో దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్‌గా వచ్చిన కేన్ విలియంసన్, బెయిర్ స్టో కలిసి మొదటి వికెట్‌కి 57 పరుగులు జోడించారు.

అయితే సీజన్‌లో మొదటి మ్యాచ్ ఆడుతున్న లూకీ ఫర్గూసన్ మ్యాజిక్‌ స్పెల్‌తో సన్‌రైజర్స్‌ను కష్టాల్లోకి నెట్టాడు. మొదటి బంతికి 19 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్స్‌తో 29 పరుగులు చేసిన కేన్ విలియంసన్‌ను ఫర్గూసన్ అవుట్ చేశాడు. 28 బంతుల్లో 7 ఫోర్లతో 36 పరుగులు చేసి జానీ బెయిర్ స్టో అవుట్ కాగా, ప్రియమ్ గార్గ్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు.

మనీశ్ పాండే 6 పరుగులు, విజయ్ శంకర్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 15 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసిన అబ్దుల్ సమద్ 19వ ఓవర్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. ఆఖరి ఓవర్‌లో 18 పరుగులు కావాల్సిన దశలో డేవిడ్ వార్నర్ 3 బౌండరీలతో 17 పరుగులు రాబట్టాడు. ఆఖరి బంతికి 2 పరుగులు కావాల్సిన దశలో సింగిల్ మాత్రమే రావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. 33 బంతుల్లో 5 ఫోర్లతో 47 పరుగులు చేశాడు డేవిడ్ వార్నర్.