జమ్మూ కశ్మీర్ పుల్వామాలో 45 మంది భారత సైనికులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దాడికి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ పాల్పడినట్లు తేలడంతో భారత్-పాక్ ల మధ్య మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఈ ప్రభావం మరోసారి భారత్-పాక్ క్రికెట్ సంబంధాలపై పడింది. 

గతంలో ముంబై దాడుల నేపథ్యంతో ఈ దాయాది దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు నిలిచిపోయాయి. అప్పటినుండి ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సీరిస్ లు నిలిచిపోయాయి. కేవలం ఐసిసి నిర్వహించే టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి.

తాజాగా పుల్వామా దాడితో ఐసిసి టోర్నీల్లో కూడా పాక్ తో భారత జట్టు ఆడించొద్దంటూ బిసిసిఐని డిమాండ్ చేస్తున్నారు.మరీ  ముఖ్యంగా త్వరలో జరగనున్న ప్రపంచ కప్ టోర్నీలో పాక్ తో జరిగే మ్యాచులను టీంఇండియా బహిష్కరించాలని కోరుతున్నారు. 

ఈ నేపథ్యంలో ఐపిఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఈ అంశంపై స్పందిచారు. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే టీంఇండియా పాక్ లో ద్వైపాక్షిక సీరిస్ లు ఆడుతుందని ఆయన తెలపారు. ఈ విషయంలో బిసిసిఐ చాలా స్పష్టంగా వుందన్నారు. 

అయితే ఐసిసి నిర్వహించే టోర్నీల్లో మాత్రం టీంఇండియా, పాక్ జట్లు తలపడుతున్నాయని శుక్లా తెలిపారు. అయితే పుల్వామా దాడి నేపథ్యంలో ప్రపంచ కప్ టోర్నీలో జరిగే భారత్-పాక్ మ్యాచుల గురించి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేమన్నారు. దీనిపై బిసిసిఐ పాలకమండలి సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని శుక్లా పేర్కొన్నారు.