పుల్వామా ఉగ్రదాడిలో సైనికులను కోల్పోయి దేశం యావత్తు దు:ఖంలో మునిగిన సమయంలో సంబరాలకు దూరంగా వుండాలపి బిసిసిఐ నిర్ణయించింది. దీంతో ఏటా అట్టహాసంగా జరిగే ఐపిఎల్ ప్రారంభోత్సవ వేడుకలను ఈసారి నిర్వహించడం లేదని సీఓఏ అధికారి వినోద్ రాయ్ వెల్లడించారు. ఈ మేరకు ఐపిఎల్ అధికారులను ఆదేశించినట్లు ఆయన ప్రకటించారు. 

శుక్రవారం బిసిసిఐ, సీఓఏ సభ్యులు ఐపిఎల్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో త్వరలో ప్రారంభంకానున్న ఐపిఎల్ గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఎటా అట్టహించే ఐపిఎల్ ఆరంభ వేడుకలను ఈసారి నిర్వహించకూడదని నిర్ణయించారు. ఈ వేడుకల  కోసం ఖర్చు చేయడానికి కేటాయించే డబ్బులను పుల్వామా దాడిలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు అందించాలని నిర్ణయించారు. ఇందుకు ఐపిఎల్ అధికారులతో పాటు బిసిసిఐ,సీఓఏ అధికారులంతా అంగీకరించినట్లు వినోద్ రాయ్ వెల్లడించారు. 

ప్రపంచ కప్ లో భారత్-పాక్ మ్యాచ్ పై కూడా చర్చించినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఆ మ్యాచ్ జూన్ 16 న జరగనుంది...కావున అప్పటివరకు ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఎలా వుంటాయో వేచిచూడాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత మరోసారి ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు వినోద్ రాయ్ పేర్కొన్నారు. 

అలాగే ప్రపంచ కప్ మెగా టోర్నీ నేపథ్యంలో ఆటగాళ్లకు,సిబ్బందికి, అధికారులకు కట్టుదిట్టమైన భద్రత  కల్పించాలని ఐసిసి కోరినట్లు తెలిపారు.  ఉగ్రవాదాన్ని ప్రేరేపించే  దేశాలకు దూరంగా వుండాలని క్రికెట్ సంబంధిత దేశాలకు  వినోద్ రాయ్ పిలుపునిచ్చారు.