ముంబై : బాల్‌ ట్యాంపరింగ్‌ సంఘటనతో గత సీజన్‌ ఐపీఎల్‌కు దూరమైన ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ ఈ సీజన్‌కు కూడా దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పాల్గొన్న అతను గాయంతో  అర్ధాంతరంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. 

కుడి మోచేతికి గాయం కావడంతో ఈ లీగ్‌లో స్మిత్ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యులు శస్త్రచికిత్స అవసరమని సూచించారు. దీంతో స్మిత్‌ టోర్నీ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. 

మంగళవారం వైద్యులు అతనికి సర్జరీ చేయనున్నారు. అయితే సర్జరీ అనంతరం స్మిత్‌ కనీసం ఆరువారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా అయితే స్మిత్‌ ఎప్రిల్‌ 15 వరకు బెడ్‌రెస్ట్‌లోనే ఉండాల్సి ఉంటుంది. 

అదే జరిగితే ఐపీఎల్‌-12 సీజన్‌ ప్రారంభ మ్యాచ్‌లకు స్మిత్‌ దూరం కావాల్సి ఉంటుంది.  దీంతో ఈ సీజన్‌లో స్మిత్‌ సేవలను చాలా మ్యాచ్‌లకు రాజస్తాన్‌ రాయల్స్‌ కోల్పోనుంది. ఇందులో భాగంగానే జట్టు యాజమాన్యం ప్రత్యామ్నాయం మార్గాలను అన్వేశిస్తోందని, స్మిత్‌ స్థానంలో మరో క్రికెటర్‌ తీసుకోవాలనే యోచనలో ఉందని సమాచారం. 

మార్చి 28వ తేదీతో స్మిత్‌ నిషేధకాలం పూర్తి అవుతుందని, ఆ తర్వాత అతను దేశవాళీ క్రికెట్‌ ఆడి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాల్సి ఉంటుందని క్రికెట్ అస్ట్రేలియా ప్రతినిధి అన్నారు.  గాయంతో బెడ్‌ రెస్ట్‌లో ఉంటే స్మిత్ ఆసీస్‌ ఆడబోయే ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌, యాషెస్‌ సిరీస్‌లకు దూరమయ్యే అవకాశం ఉంటుందని అన్నారు.