పారిస్ పారాలింపిక్ గేమ్స్ 2024: బ్రాంజ్ మెడల్ గెలిచిన నిత్యా శ్రీ శివన్
Nithya Sre Sivan : తమిళనాడులోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నిత్య శ్రీ శివన్ 2016లో ఆమె బ్యాడ్మింటన్‌ను చేపట్టింది. అద్భుతమైన ప్రదర్శనలతో ఇప్పుడు పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్యం సాధించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చింది.
Nithya Sre Sivan : పారిస్ పారాలింపిక్స్ 2024లో బ్యాడ్మింటన్‌లో SH6 విభాగంలో భారత ప్లేయర్ నిత్యశ్రీ శివన్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. లా చాపెల్లె ఎరీనా కోర్ట్ 3లో ఆమె ఇండోనేషియాకు చెందిన రినా మార్లినాను 21-14, 21-6 తేడాతో ఓడించింది. ప్రారంభ గేమ్‌లో నిత్య 7-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది, అయితే మార్లినా అద్భుతంగా పునరాగమనం చేసి 10-10తో నిలిచింది. గేమ్ ను కోల్పోయే ప్రమాదంలో ఉన‌్న నిత్య అద్భుతమైన ప్రదర్శన చేస్తూ మళ్లీ గేమ్ ను తన వైపు లాగేసుకుంది. కేవలం 13 నిమిషాల్లో గేమ్‌ను ముగించింది. ఈ తర్వాత రెండో గేమ్ లో కూడా అద్భుత ప్రదర్శన చేసింది. ఆరంభంలో 10-2తో భారీ ఆధిక్యంలో నిలిచింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా 23 నిమిషాల్లోనే వరుస గేమ్‌లతో మ్యాచ్‌ను ముగించింది.
తమిళనాడులోని హోసూర్‌లో జన్మించిన నిత్య ప్రస్తుతం మహిళల సింగిల్స్ SH6 విభాగంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను కలిగి ఉన్నారు. క్రీడా వాతావరణంలో పెరిగిన నిత్యకు తన సోదరుడు, తండ్రి స్ఫూర్తితో మొదట్లో క్రికెట్‌పై ఆసక్తి ఉండేది. అయితే, ఆమె 2016లో రియో ఒలింపిక్స్‌ని చూస్తున్నప్పుడు బ్యాడ్మింటన్‌పై తనకున్న మక్కువను గుర్తించి లిన్ డాన్‌కి అభిమానిగా మారింది. ఆమె స్థానిక అకాడమీలో బ్యాడ్మింటన్ ను మొదలు పెట్టింది. చాలా తక్కువ కాలంలోనే అద్భుతమైన నైపుణ్యాలు ప్రదర్శించింది. మొదట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా వారానికి రెండుసార్లు మాత్రమే హాజరయ్యేది. ఆమె అంకితభావం, ప్రతిభ ను గుర్తించిన ఆమె కోచ్ రెగ్యులర్ ప్రాక్టీస్ సిఫార్సు చేశారు.
చివరికి ఆమె టీం ఇండియా ప్రధాన కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయిన శ్రీ గౌరవ్ ఖన్నా సర్ వద్ద వృత్తిపరమైన శిక్షణ కోసం లక్నోకు మారింది. నిత్య అంతర్జాతీయ, జాతీయ పోటీల్లో అనేక విజయాలు సాధించింది. బహ్రెయిన్‌లో జరిగిన ఆసియా యూత్ పారా గేమ్స్ 2021లో సింగిల్స్‌లో బంగారు పతకం, టోక్యోలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ 2022లో సింగిల్స్, డబుల్స్‌లో కాంస్య పతకాలు గెలుచుకుంది. వివిధ అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో అనేక బంగారు పతక విజయాలు కూడా ఆమె అందుకుంది.
8 నెలల తర్వాత తిరిగొస్తున్న కోహ్లీ.. బంగ్లాదేశ్ సిరీస్ కు భారత జట్టులోని 15 మంది ప్లేయర్లు