భారత వాలీబాల్ జట్టు ప్రభంజనం.. దక్షిణ కొరియాను ఓడించి, నాకౌట్ దశకు చేరిక..
ఆసియా క్రీడల్లో భారత పురుషుల వాలీబాల్ జట్టు అద్భుత విజయం సాధించింది. దక్షిణ కొరియా జట్టును ఓడించింది. నాకౌట్ దశకు చేరుకుంది. 2 గంటల 38 నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగింది. ఇందులో ఇండియా టీమ్ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది.

భారత పురుషుల వాలీబాల్ జట్టు ప్రభంజనం సృష్టించింది. క్రీడారంగంలో ఉన్నత ర్యాంక్‌లో ఉన్న కొరియా జట్టును ఓడించింది. అద్భుత ప్రదర్శన ఇచ్చి అందరినీ ఆశ్చర్యంలో నాకౌట్ దశకు అర్హత సాధించింది. 3-2 (25-27, 29-27, 25-22, 20-25, 17-15)తో కమాండింగ్ స్కోర్‌తో విజయం సాధించింది.
ఆసియా క్రీడలు 2023 అసాధారణమైన, ఊహించని క్రీడా సంఘటనకు సాక్షిగా నిలిచింది. అత్యంత నైపుణ్యం కలిగిన కొరియన్ వాలీబాల్ జట్టు, క్రీడలో అగ్రశ్రేణి పోటీదారులలో ఒకటిగా గుర్తింపు పొందిన జట్టును టీమ్ ఇండియా ఓడించింది. 1966 నుంచి ప్రతీ సారి జరిగే ఆసియా క్రీడల్లో కొరియా జట్టు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ లో ఏదో ఒకటి సాధిస్తోంది. అయితే భారత జట్టు మాత్రం చివరి సారిగా 1986 సియోల్‌లో బ్రాంజ్ మెడల్ తో సరిపెట్టుకుంది. జకార్తాలో 2018లో కొరియా సిల్వర్ మెడల్ గెలుచుకుంది. అయితే అదే ఏడాది భారత వాలీబాల్ జట్టు 12వ స్థానంలో ఉంది. కానీ సారి తన అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది.
దక్షిణ కొరియాపై విజయం భారత పురుషుల వాలీబాల్ జట్టు ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. అమిత్ గులియా, అశ్వల్ రాయ్, వినీత్ కుమార్ అద్భుతమైన ఆట తీరు జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అమిత్ అత్యధికంగా 24 పాయింట్లు స్కోర్ చేయగా.. మిగితా ఇద్దరు చెరో 19 పాయింట్ల చొప్పున స్కోర్ చేశారు.