హిమాదాస్‌కి డీఎస్పీ పదవి... అస్సాంలో పోలీస్ బాస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న స్ప్రింటర్ క్వీన్...
21 ఏళ్ల భారత అథ్లెట్ హిమాదాస్‌కి డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ పదవి...
2018 ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఓ రజతం గెలిచిన హిమా దాస్...
వరల్డ్ అండర్ 19 ఛాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణం గెలిచిన మొట్టమొదటి భారత స్ప్రింటర్‌గా రికార్డు...
21 ఏళ్ల భారత అథ్లెట్ హిమాదాస్‌కి డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ పదవి వరించింది. 2018 ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఓ రజతం సాధించి రికార్డు క్రియేట్ చేసిన భారత పరుగుల రాణి హిమా దాస్... వరల్డ్ అండర్ 19 ఛాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించింది.
అస్సాంలోని డింగ్ ఏరియాలోని సమీపంలో కందులిమరి అనే మారుమూల గ్రామంలో జన్మించిన హిమాదాస్, షూస్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకుండా ఎన్నో కష్టాలు అధిగమించి, భారత త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికలపై రెపరెపలాడించింది.
అస్సాం ముఖ్యమంత్రి సర్భానంద్ సోన్వాల్ అధ్యక్షణన బుధవారం రాత్రి గౌహతిలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో అస్సాం రాష్ట్రానికి ప్రపంచ ఖ్యాతి తీసుకొచ్చిన హిమాదాస్‌కి డీఎస్పీ పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
హిమాదాస్‌తో పాటు ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు గెలిచిన వారిని క్లాస్-1 అధికారులుగా నియమించబోతున్నట్టు ప్రకటించింది అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. డీఎస్పీగా నియమితురాలైన హిమాదాస్‌కి అభినందనలు తెలిపారు భారత క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు.