తాను ఓ యువతితో గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నానంటూ భారత  అథ్లెట్ ద్యుతి చంద్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కేవలం ఈ సహజీవనంతోనే మా ప్రయాణం ముగియదని...ఇరు కుటుంబాలను ఒప్పించి అతి త్వరలో పెళ్లి చేసుకుంటామన్న ద్యుతిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె స్వరాష్ట్రం ఒడిషా నుండే ఎక్కువమంది ఈ వ్యవహారంపై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ద్యుతి తల్లి కూడా కూతురిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. 

 '' నా మేనకోడలి కూతురితోనే ద్యుతి సహజీవనం చేస్తున్నానని చెప్పింది. యుక్త వయసులో వున్న ఆమెకు ఏవో మాయమాటలు చెప్పి లోబర్చుకున్నట్లుంది. నాకు మనవరాలు అవుతుందంటే ద్యుతికి కూతురు వరస అవుతుంది. అలాంటి అమ్మాయితో వావివరసలు మరిచి అనైతిక చర్యలకు పాల్పడుతూ నా కూతురు బరితెగించింది. అంతటితో ఆగకుండా ఇప్పుడుమ పెళ్లిచేసుకుంటానంటోందని... ఆ ప్రకృతి విరుద్దమైన పనికి తాము సహకరించబోం'' అంటూ ద్యుతి తల్లి అఖోజీ చంద్‌ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 

తన కూతురిని చాలాసార్లు ఇలాంటి అనైతిక సంబంధాలను వదులుకుని ఆటపై దృష్టి పెట్టమని చెప్పానని...కానీ తాను ఆ మాటలు వినిపించుకునేది కాదని తెలిపారు. తన ఆటతో దేశ గౌరవాన్ని, తల్లిదండ్రుల పరువును మరింత పెంచాల్సిన ద్యుతి అసహజమైన పనులతో వార్తల్లో నిలవడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంస్తులే కాదు ఒడిషా రాష్ట్రంలోని చాలా మంది ద్యుతి పెళ్లిని అంగీకరించడం లేదని...వీరందరిని కాదని ఎక్కడ, ఎలా పెళ్లి చేసుకుంటుందో చూస్తానని అఖోజీ చంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.