కామన్వెల్త్‌లో కత్తి దూసిన భారత ఫెన్సర్ భవానీ దేవి...ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో రెండో స్వర్ణం...
కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భవానీ దేవికి రెండో స్వర్ణం... ఆగస్టు 20 వరకూ సాగే ఈ పోటీల్లో భారత్ నుంచి ఐదుగురు ఫెన్సర్లు..
భారత స్టార్ ఫెన్సర్ భవానీ దేవి, కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం కైవసం చేసుకుంది. కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్ 2022లో సీనియర్ వుమెన్ సేబర్ వ్యక్తిగత విభాగంలో పోటీపడిన భవానీ దేవి, ఆస్ట్రేలియా ఫెన్సర్ విరోనిక వసిలేవతో జరిగిన ఫైనల్‌లో 15-10 తేడాతో విజయం అందుకుంది...
కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భవానీ దేవికి ఇది రెండో స్వర్ణం. ఇంతకుముందు 2019లోనూ స్వర్ణం గెలిచింది భవానీ దేవి. కామన్వెల్త్ గేమ్స్ 2022 ఆగస్టు 8న ముగియగా లండన్ వేదికగా కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్ 2022 పోటీలు ఆగస్టు 9న ప్రారంభమయ్యాయి...
ఆగస్టు 20 వరకూ సాగే ఈ పోటీల్లో భారత్ నుంచి సీఏ భవానీ దేవీతో పాటు మోహిత్ మహేంద్ర, రాజీవ్ మెహతా, తనిక్ష కత్రీ,కరణ్ సింగ్ పాల్గొంటున్నారు. 2019లో భారత్ నుంచి భవానీ దేవీతో పాటు భారత పురుషుల సేబర్ టీమ్ ఛాంపియన్‌షిప్ గెలిచింది. భారత ఫెన్సర్ కరణ్ సింగ్‌కి కాంస్య పతకం దక్కింది..
టోక్యో ఒలింపిక్స్ 2022లో భారత్ నుంచి బరిలో దిగిన భవానీ దేవీ, తొలి రౌండ్‌లో సంచలన విజయం అందుకుని, రెండో రౌండ్‌లో ప్రవేశించిన మొట్టమొదటి భారత ఫెన్సర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. అయితే రెండో రౌండ్‌లో వరల్డ్ నెంబర్ 3 ఫెన్సర్ మనన్ బ్రునెట్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది భవానీ దేవి...
తమిళనాడు రాష్ట్రానికి చెందిన భవానీ దేవి, ఫెన్సింగ్‌లో 8 సార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఫెన్సింగ్‌లో ప్రాతినిధ్యం వహించిన ఏకైక అథ్లెట్ భవానీ దేవీయే. టోక్యో ఒలింపిక్స్‌లో భవానీ దేవీ ఉపయోగించిన కత్తిని, భారత ప్రధాని నరేంద్ర మోదీకి కానుకగా ఇచ్చిందామె. ఈ కత్తిని ఆన్‌లైన్ ద్వారా వేలంలో విక్రయించారు...
భవానీ దేవీ వాడిన ఫెన్సింగ్ కత్తికి ఈ ఈ-వేలంలో బేస్ ప్రైజ్ రూ.61 లక్షలుగా నిర్ణయించారు. దాదాపు కోటి రూపాయలకు క్రీడాభిమానులు కొనుగోలు చేసినట్టు సమాచారం. భవానీ దేవీ వాడిన కత్తితో పాటు టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా వాడిన జావెలిన్ త్రో, పీవీ సింధు ఉపయోగించిన షెట్లర్ బ్యాట్... ఇలా భారత అథ్లెట్లు వాడిన క్రీడా వస్తువులను విక్రయించి, ఇలా వచ్చిన మొత్తాన్ని ప్రధాని సహాయ నిధికి తరలించింది కేంద్ర క్రీడా శాఖ...