అతడు తన చిరకాల లక్ష్యమైన భారత జట్టులో స్థానాన్ని సెప్టెంబర్ 4వ తేదీనే చేజిక్కించుకున్నాడు. ఇది ఆ క్రికెటర్ జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు. అయితే అదే సెప్టెంబర్ 4వ తేదీన తనకు అత్యంత ఇష్టమైన క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఇది అతడి జీవితంలోనే అత్యంత బాధాకరమైన రోజు. ఇలా ఒకే తేదీ అతడి జీవితంలో తీపి, చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఇంతకూ ఇలా సెప్టెంబర్ 4వ తేదీతో అనుబంధం కలిగిన క్రికెటర్ ఎవరో తెలెసుకోవాలంటే కింది స్టోరీ చదవాల్సిందే.

ఆర్పీ సింగ్....టీంఇండియాకు తన పేస్ బౌలింగ్ ప్రదర్శనతో అద్భుతమైన విజయాలు అందించాడు. ఇతడు సరిగ్గా అంతర్జాతీయ క్రికెటర్ గా టీంఇండియా తరపున 13 ఏళ్ళ క్రితం సెప్టెంబర్ 4నే బరిలోకి దిగాడు. ఎంతో మంది క్రీడాకారులు టీంఇండియాలో స్థానమే లక్ష్యంగా కష్టపడుతుంటారు. కానీ కొందరికే ఈ అవకాశం దక్కుతుంది. ఇలాగే ఆర్పీసింగ్ కు కూడా టీంఇండియా జెర్సీ ధరించే అవకాశం లభించింది. దీంతో అతడు ఈ సెప్టెంబర్ 4వ తేదీని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకున్నాడు.

అయితే తాజాగా అతడు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు ప్రకటించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో తన రిటర్మెంట్ లెటర్ ను పోస్ట్ చేశారు. సరిగ్గా 2005 సెప్టెంబర్ 4 వ తేదీన తన అంతర్జాతీయ కేరీర్ ప్రారంభమైందన్న ఆర్పీ సింగ్ 13 ఏళ్ల తర్వాత అదే రోజున ఎండ్ అవుతోందంటూ ఎమోషనల్ గా తెలిపాడు. ఈ మధ్యకాలంలో తనకు సహకరించిన బిసిసిఐ, సహచరులు, కోచ్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్పీసింగ్ అంతర్జాతీయ క్రికెట్ లో కంటే ఐపీఎల్ లోనే ఎక్కువ సక్సెస్ అయ్యారు. రెండో సీజన్ లో హైదరాబాద్ జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్ లో అతడు టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. దీంతో ఆర్పీ సింగ్ కు హైదరాబాదీలు అభిమానులుగా మారారు.