పీవీ సింధుకి గాయం... వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కి దూరంగా భారత బ్యాడ్మింటన్ స్టార్...

కామన్వెల్త్ గేమ్స్ క్వార్టర్ ఫైనల్‌లోనే పీవీ సింధు ఎడమకాలికి గాయం... మొండిగా ఆటను కొనసాగించి గోల్డ్ మెడల్ గెలిచిన సింధు...

Indian Badminton Star PV Sindhu skip BWF World Championships due to Injury

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, కెరీర్‌లో పీక్ స్టేజీలో కొనసాగుతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధు, కామన్వెల్త్ గేమ్స్ 2022లో స్వర్ణం సాధించి చరిత్ర క్రియేట్ చేసింది. ఒలింపిక్స్ తర్వాత సింగపూర్ ఓపెన్ 2022, స్విస్ ఓపెన్ 2022 విజేతగా నిలిచింది...

కామన్వెల్త్ గేమ్స్ 2022 ముగిసిన తర్వాత టోక్యోలో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొనాల్సి ఉంది పీవీ సింధు. ఈ పోటీలు ఆగస్టు 21న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వారం ముందే వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, అందర్నీ షాక్‌కి గురి చేసింది పీవీ సింధు...

కామన్వెల్త్ గేమ్స్ సమయంలో పీవీ సింధుఎడమ కాలి పాదానికి గాయమైంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గాయపడినా మొండిగా ఆటను కొనసాగించిన పీవీ సింధు, ఆ గాయాన్ని లెక్కచేయకుండా ఫైనల్ చేరి స్వర్ణం సాధించింది. అయితే గాయం తగ్గడానికి రెండు వారాలకు పైగా సమయం పడుతుందని, అంతవరకూ పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో సింధు, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌కి దూరమవుతున్నట్టు ఆమె తండ్రి పీవీ రమణ తెలియచేశారు...

‘అవును, పీవీ సింధు వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌కి దూరంగా ఉండనుంది. సింగపూర్ ఓపెన్, కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచి మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ఈ గాయం కావడం నిజంగా బాధాకరం. అయితే ఇవన్నీ మన చేతుల్లో ఉండవు కదా... సింధు త్వరలోనే ఇదే ఫామ్‌తో తిరిగి వస్తుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు పీవీ రమణ...

పీవీ సింధు ట్వీట్ ద్వారా వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ నుంచి తప్పుకుంటున్నట్టు నిర్ధారించింది. ‘కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ నుంచి తప్పుకోవాల్సి రావడం బాధగా ఉంది. కామన్వెల్త్ గేమ్స్ క్వార్టర్ ఫైనల్‌లోనే నాకు గాయమైంది.

అయినా ఫిజియో, ట్రైయినర్, కోచ్ సాయంతో నొప్పితోనే సెమీ ఫైనల్స్, ఫైనల్స్ ఆడగలిగాడు. ఫైనల్‌లో భరించలేని నొప్పితో బాధపడ్డాను. ఇలాగే వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆడితే నా నూరు శాతం ఆటను ప్రదర్శించలేను. అందుకే తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నా...’ అంటూ రాసుకొచ్చింది పీవీ సింధు...

కామన్వెల్త్ గేమ్స్ 2022 వుమెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో కెనడా బ్యాడ్మింటన్ ప్లేయర్ మిచెల్ లీపై 21-15, 21-13 తేడాతో వరుస సెట్లలో ఘన విజయం అందుకుంది పీవీ సింధు. ఇంతకుముందు 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం, 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌ బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఫైనల్‌లో ఓడి రజతం సాధించిన పీవీ సింధు, ఈసారి ఏకంగా స్వర్ణం సాధించి... ‘ఇండియన్ గోల్డెన్ గర్ల్’గా కీర్తి ఘడించింది... 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios