భారత్ తరపున అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న స్ప్రింటర్ పలేందర్ చౌదరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 18 ఏళ్ల యువ క్రీడాకారుడి ఆత్మహత్య స్పోర్ట్  అథారిటీ ఆప్ ఇండియాలో కలకలం రేపుతోంది. ఈ ఘటన డిల్లీలో చోటుచేసుకుంది. 

జవహార్ లాల్ స్టేడియంలోని అథ్లెటిక్ అకామీ హాస్టల్లో స్ప్రింటర్ పలేందర్ ఆశ్రయం తీసుకుంటున్నాడు. ఇతడు భారత్ తరపున అనేక ఇంటర్నేషన్ మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహిస్తూ రాణిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం అతడి సోదరి అకాడమీ వద్దకు వచ్చి కలిసింది. ఆమె వెళ్లిపోయిన కాస్సేపటికే పలేందర్ తన రూం లోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

కొన ఊపిరితో కొట్టుమిట్టాడున్న పలేందర్ ను గమనించిన తోటి క్రీడాకారులు కోచ్ తో పాటు అధికారులకు సమాచారం అందించారు. అతన్ని కాపాడి చికిత్స నిమిత్తం సప్దార్ గంజ్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న అతడు బుధవారం ఉదయం మృతిచెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. 

ఈ ఆత్మహత్యను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు శాయ్ డైరెక్టర్ జనరల్ నీలమ్ కపూర్ తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీ సెక్రటరీ స్వరణ్ సింగ్ చంబ్రా ఆద్వర్యంలో విచారణ జరుగుతోందని...వారం రోజుల్లో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు  నీలమ్ కపూర్ తెలిపారు. 

ఆర్థిక ఇబ్బందుల కారణంగానే యువ స్ప్రింటర్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.