రెండో టీ20: భారత్ పై ఇంగ్లాండు ప్రతీకారం

India vs England: Alex Hales Keeps Nerve As England Square T20 Series With India
Highlights

అలెక్స్ హేల్స్ ఇంగ్లాండు ఆశలను సజీవంగా ఉంచాడు. దూకుడుగా ఆడిన హేల్స్ రెండో టీ20లో భారత్ పై ఇంగ్లాండుకు విజయాన్ని అందించాడు. దాంతో ఇంగ్లాండు సిరీస్ ను సమయం చేయగలిగింది.

కార్డిఫ్‌: తొలి ట్వంటీ20 మ్యాచులో ఓటమికి ఇంగ్లాండు క్రికెట్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. తప్పకుండా గెలవాల్సిన మ్యాచులో ఇంగ్లాండు జట్టు భారత్ పై విజయం సాధించి 3 మ్యాచుల సిరీస్ ను సమం చేసింది. దీంతో మూడో ట్వంటీ20 మ్యాచుపై ఉత్కంఠను సృష్టించింది.

అలెక్స్‌ హేల్స్‌ (41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. దాంతో శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండు విజయం సాధించింది. 

ఈ పరాజయంతో భారత్‌ వరుసగా ఏడు టీ20ల విజయాలకు బ్రేక్‌ పడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు సాధించింది. విరాట్‌ కోహ్లీ (38 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లతో 47) రాణించాడు. ధోనీ (24 బంతుల్లో 5 ఫోర్లతో 32 నాటౌట్‌), రైనా (20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 27) తమ వంతు పాత్ర నిర్వహించారు. 

ఇంగ్లాండు 149 పరుగుల లక్ష్యంతో తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లాండు 19.4 ఓవర్లలో 149/5 స్కోరు చేసి గెలిచింది. బెయిర్‌స్టో (28) రాణించాడు. ఉమేశ్‌కు రెండు వికెట్లు దక్కాయి.
 
ఉమేశ్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (15) రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో జోరు చూపించాడు. అయితే ఉమేశ్‌ తన రెండు ఓవర్లలో రెండు వికెట్లు తీసి ఇంగ్లాండును చిక్కుల్లో పడేశాడు. 

బెయిర్‌స్టోతో కలిసి హేల్స్‌ బౌండరీలు సాధిస్తూ స్కోరును పెంచాడు. 18వ ఓవర్‌లో బెయిర్‌స్టోను భువనేశ్వర్‌ అవుట్‌ చేయడంతో ఇంగ్లాండు మరోసారి చిక్కుల్లో పడింది. చివరి ఓవర్‌లో 12 పరుగులు రావాల్సి ఉండగా హేల్స్‌ 6,4తో విజయాన్ని అందించాడు.
 
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఇంగ్లాండు పేసర్ల ధాటికి పవర్‌ప్లే ముగిసేసరికి భారత్‌ 31 రన్స్‌కే తొలి మూడు వికెట్లు కోల్పోయింది. గత రెండేళ్లలో భారత్‌కు ఇదే అత్యల్ప పవర్‌ప్లే స్కోరు. కెప్టెన్‌ కోహ్లీ, రైనా నిదానంగా ఆడి ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు. 11వ ఓవర్‌లో కోహ్లీ 4, 6 బాదగా ఆ తర్వాత ఓవర్‌లో రైనా మరో సిక్సర్‌ సాధించాడు. 

loader