Asianet News TeluguAsianet News Telugu

చెలరేగిన ఇషాంత్ శర్మ: ఇంగ్లాండు స్కోరు 198/7

ఇంగ్లాండుతో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో భారత బౌలర్ ఇషాంత్ శర్మ చెలరేగాడు. దీంతో ఇంగ్లాండు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 198 పరుగులు మాత్రమే చేసింది.

India vs England 5th Test: Ishant-Bumrah restrict England to 198/7
Author
London, First Published Sep 8, 2018, 7:45 AM IST

లండన్: ఇంగ్లాండుతో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో భారత బౌలర్ ఇషాంత్ శర్మ చెలరేగాడు. దీంతో ఇంగ్లాండు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 198 పరుగులు మాత్రమే చేసింది. తన చివరి టెస్టు మ్యాచు ఆడుతున్న అలిస్టర్ కుక్ రాణించాడు.

ఇంగ్లాండు ఓపెనర్‌ అలిస్టర్‌ కుక్‌ (190 బంతుల్లో 8 ఫోర్లతో 71), మొయిన్‌ అలీ (170 బంతుల్లో 4 ఫోర్లతో 50) అర్ధ అర్థ సెంచరీలతో రాణించారు. క్రీజులో బట్లర్‌ (11 బ్యాటింగ్‌), రషీద్‌ (4 బ్యాటింగ్‌) ఉన్నారు. ఇషాంత్‌ మూడు, బుమ్రా.. జడేజాలు రెండేసి వికెట్లు తీశారు.
 
వరుసగా ఐదో టెస్టులోనూ టాస్‌ నెగ్గి తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు కుక్‌, జెన్నింగ్స్‌ (23) మంచి ఆరంభాన్నిచ్చారు. నెమ్మదిగా బ్యాటింగ్‌ చేసిన ఈ జోడీ తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్నినెలకొల్పారు. 

అయితే ఆ జోడీని జడేజా 24వ ఓవర్‌ తొలి బంతికి విడదీశాడు. లెగ్‌సైడ్‌ వచ్చిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన జెన్నింగ్స్‌ స్లిప్‌లో రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. వఆ తర్వాత కుక్‌, అలీ మరో వికెట్‌ పడకుండా లంచ్‌ బ్రేక్‌కు వెళ్లారు.
 
లంచ్ విరామం తర్వాత బౌలర్లు బుమ్రా, షమి అద్భుత బంతులు విసిరినా ఫలితం లేకపోయింది. దీనికి తోడు పేలవ ఫీల్డింగ్‌ కారణంగా కుక్‌, అలీ ఇచ్చిన క్యాచ్‌లను వదిలేయడంతో ఈ సెషన్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయారు. 

క్రీజులో అద్భుతంగా కుదురుకున్న కుక్‌ 139 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ జోడీ నెమ్మదిగా బ్యాటింగ్‌ చేయడంతో రెండు గంటల్లో కేవలం 55 పరుగులే వచ్చాయి. అటు రెండో వికెట్‌కు అజేయంగా 63 పరుగుల భాగస్వామ్యంతో ఇంగ్లాండ్‌ టీ బ్రేక్‌కు వెళ్లింది.
 
చివరి సెషన్‌ ప్రారంభంలోనే బుమ్రా రెండు వికెట్లు తీశాడు. 64వ ఓవర్‌ రెండో బంతికి కుక్‌ను బౌల్డ్‌ చేసి సుదీర్ఘ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. దీంతో రెండో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అదే ఓవర్‌ ఐదో బంతికి రూట్‌ను చక్కటి ఇన్‌స్వింగర్‌తో ఎల్బీగా అవుట్‌ చేశాడు. 

ఆ తర్వాతి ఓవర్‌లోనే ఇషాంత్‌ బెయిర్‌స్టోను డకౌట్‌ చేయడంతో ఒక్క పరుగుకు ఆ జట్టు మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో స్టోక్స్‌ (11)తో కలిసి అలీ ఐదో వికెట్‌కు 37 పరుగులు జోడించాడు. అయితే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే ఇషాంత్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అదే ఓవర్‌లో కర్రాన్‌ కూడా డకౌట్‌ అయ్యాడు.

Follow Us:
Download App:
  • android
  • ios