అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ లో ఆదిలోనే భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది. యంగ్ బ్యాటింగ్ స్టార్ పృథ్వీ షా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ తో శుక్రవారం జరిగిన మ్యాచులో క్యాచ్ ను అందుకునే సమయంలో పృథ్వీ షా గాయపడ్డాడు. 

డీప్ మిడ్ వికెట్ బౌండరీలో క్యాచ్ అందుకోవడానికి పృథ్వీ షా ఎడమ మోకాలిని మడత పెట్టి జారాడు. ఆ సమయంలో అతనికి గాయమైంది. దాంతో అతను గురువారం నుంచి జరిగే అడిలైడ్ టెస్టుకు అందుబాటులో ఉంటాడా లేదా అనేది అనుమానంగా ఉంది. 

వెస్టిండీస్ తో అక్టోబర్ లో జరిగిన తొలి టెస్టు మ్యాచులో పృథ్వీ షా సెంచరీ చేశాడు. శుక్రవారంనాడు మైదానంలో గాయపడిన పృథ్వీ షా వద్ద వైద్య బృందం పరుగెత్తుకొచ్చింది. 

ప్రస్తుతం పృథ్వీ షా గాయం తీవ్రతను వైద్య బృందం పరీక్షిస్తోందని బిసిసిఐ ఓ ట్వీట్ లో తెలిపింది. గాయమైన తర్వాత స్కాన్ తీయడానికి అతన్ని ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు.