ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఓ హైదరాబాదీ బౌలర్ అదరగొడుతున్నాడు. బెంగళూరులో ఆస్ట్రేలియా 'ఎ' జట్టుతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో తన అద్భుత ప్రదర్శనతో ఏకంగా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. దీంతో తన ఫస్ట్ క్లాస్ కెరీర్ లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదుచేసుకున్నాడు. 

బెంగళూరు వేదికగా భారత 'ఎ' జట్టు ఆస్ట్రేలియా ఫస్ట్ క్లాస్ జట్టుతో అనధికార టెస్ట్ లో తలపడుతోంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ మ్యాచ్ లో మొదటిరోజు ఆస్ట్రేలియా జట్టు బ్యాంటింగ్ చేపట్టింది. అయితే హైదరాబాదీ ఫేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ దాటికి ఆస్ట్రేలియా జట్టు నిలవలేకపోయింది. ఇతడు ఈ మ్యాచ్ లో ఏకంగా 8 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించాడు.

సిరాజ్ విజృంభనతో  ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 243 పరుగులకే ఆలౌంటయ్యింది. అయితే ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్ ఉస్మాన్ ఖాజా చరీతో ఒంటరి పోరాటం చేయడంతో ఈ మాత్రం గౌరవప్రదమైన స్కోరును సాధించగల్గింది. ఇతడికి లబ్‌షేన్(60) చక్కటి సహకారం అందించాడు. 

సిరాజ్ కు తోడుగా కుల్దీప్ యాదవ్ కూడా చక్కగా బౌలింగ్ చేశాడు. కల్దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు.  కేవలం సిరాజ్, కుల్దీప్ లు ఇద్దరే ఆస్ట్రేలియా జట్టును ఆలౌట్ చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన భారత జట్టు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 12 ఓవర్లలో 41 పరుగులు చేసింది.