Budget 2022: క్రీడా బడ్జెట్ కు బూస్ట్ ఇచ్చిన నిర్మలమ్మ.. గతేడాది కంటే భారీగా కేటాయింపులు
Union Budget 2022- Sports Allocations: టోక్యో ఒలింపిక్స్ తో పాటు పారాలింపిక్స్ లో భారత్ సాధించిన ఘన విజయాలతో భవిష్యత్ మీద కొత్త ఆశలు కల్పించిన క్రీడాకారుల పట్ల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కనికరం చూపారు.
పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్ - 2022 ను ప్రవేశపెట్టారు. దేశంలో క్రీడా రంగానికి ఈసారి ఆమె కేటాయింపులను పెంచారు. గతేడాదితో పోలిస్తే క్రీడలకు రూ. 300 కోట్లను పెంచుతూ కేటాయింపులు చేశారు. టోక్యో ఒలింపిక్స్ తో పాటు ఆ తర్వాత జరిగిన పారాలింపిక్స్ లో భారత జట్టు అద్భుత ఫలితాలు సాధించిన నేపథ్యంలో క్రీడా రంగానికి భారీగా కేటాయింపులు పెరిగాయి. గతేడాది ప్రదర్శనలు భవిష్యత్తులో విశ్వ వేదికలమీద త్రివర్ణ పతాకం రెపరెపలాడటానికి, మరిన్ని అద్భుతాలకు ఆశలనివ్వడంతో క్రీడా రంగానికి గతేడాది కంటే కేటాయింపులు పెంచారు నిర్మలమ్మ.. ఈ ఏడాది క్రీడారంగానికి రూ. 3,062.60 కోట్ల కేటాయింపులు చేస్తున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆమె వెల్లడించారు.
ఈ ఏడాది ఆసియా గేమ్స్ తో పాటు కామన్వెల్త్ క్రీడలు కూడా జరగాల్సి ఉంది. 2024లో పారిస్ లో జరుగబోయే ఒలింపిక్స్ లో టోక్యో కంటే ఎక్కువ పతకాలు సాధించాలని లక్ష్యంతో ఉన్న భారత్.. ఆసియా, కామన్వెల్త్ లలో సత్తా చాటాలని భావిస్తున్నది. ఇప్పట్నుంచే క్రీడాకారులకు మెరుగైన వసతులు, సదుపాయాలను కల్పించాలని సంకల్పించింది.
2021-22 బడ్జెట్ లో క్రీడలకు రూ. 2,596. 14 కోట్ల కేటాయింపులు దక్కాయి. తర్వాత దీనిని రూ. 2,757.02 కోట్లకు పెంచారు. కాగా ఈ సారి క్రీడలకు రూ. 3,062.60 కోట్లను కేటాయిస్తున్నట్టు నిర్మలమ్మ ప్రకటించారు. అంటే గతేడాదితో పోలిస్తే రూ. 305.58 కోట్లు ఎక్కువ.
ఖేలో ఇండియా ప్రోగ్రామ్ కు గతేడాది రూ. 657.71 కోట్లు కేటాయించగా దానిని ఇప్పుడు రూ.974 కోట్లకు పెంచారు. క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకార నగదుకు గతంలో రూ. 245 కోట్లు కేటాయించగా ఇప్పుడది రూ. 357 కోట్లకు పెరిగింది.
క్రీడాకారులకు జాతీయ క్యాంపులు, శిక్షణ, మౌళిక వసతులు కల్పన, శిక్షణా కార్యాలాయల్లో వసతులు, అధునాతన క్రీడా సామాగ్రి.. ఇతరత్రా అవసరాల కోసం కేంద్ర క్రీడా, యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ వీటిని ఖర్చు చేయనున్నది.
ఇదిలాఉండగా.. గతేడాది జపాన్ వేదికగా ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో భారత్ 7 పతకాలు నెగ్గింది. జావెలిన్ త్రో లో నీరజ్ చోప్రా స్వర్ణం నెగ్గగా.. రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు దక్కాయి. పారాలింపిక్స్ లో భారత్.. ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఆరు కాంస్యాలతో మొత్తం 19 పతకాలు సాధించింది.