ఎవర్రా మనల్ని ఆపేది! ఫైనల్‌లో పాక్‌ని ఓడించి, జూనియర్ ఆసియా కప్ కైవసం చేసుకున్న టీమిండియా...
జూనియర్ హాకీ ఆసియా కప్ టోర్నీ కైవసం చేసుకున్న భారత మెన్స్ టీమ్... ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 2-1 తేడాతో విజయం...
ఆసియా కప్‌లో టీమిండియా తిరుగులేని ఆధిపత్యం కొనసాగుతోంది. సీనియర్ మెన్స్ క్రికెట్ టీమ్‌కి ఆసియా కప్ 2022 టోర్నీలో పరాభవం ఎదురైనా అండర్ 19 ఆసియా కప్, వుమెన్స్ ఆసియా కప్ టోర్నీల్లో టీమిండియానే విజేతగా నిలిచింది. తాజాగా జూనియర్ హాకీ ఆసియా కప్ టోర్నీలో భారత జట్టు సత్తా చాటింది...
ఓమన్‌లో గురువారం జరిగిన జూనియర్ ఆసియా కప్ మెన్స్ ఫైనల్ మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌పై 2-1 తేడాతో ఘన విజయం అందుకుంది భారత జూనియర్ హాకీ జట్టు. టీమిండియాకి ఇది నాలుగో జూనియర్ ఆసియా కప్. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ టోర్నీని మొదలెట్టిన భారత హాకీ జట్టు, టైటిల్‌ని కాపాడుకుంటూ దాయాదులపై తిరుగులేని ఆధిపత్యం కనబర్చింది..
ఆట ప్రారంభమైన 13వ నిమిషంలో గోల్ చేసిన అంగద్ బిర్ సింగ్, టీమిండియాకి 1-0 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత ఆట 20వ నిమిషంలో అరైజిత్ సింగ్ హుండల్ రెండో గోల్ చేయడంతో భారత జట్టు 2-0 తేడాతో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది..
ఆట 37వ నిమిషంలో గోల్ చేసిన అబ్దుల్ బసరత్, భారత జట్టు ఆధిక్యాన్ని 2-1 తేడాకి తగ్గించగలిగాడు. అయితే ఆ తర్వాత గోల్ చేసేందుకు పాక్ జట్టు చేసిన ప్రయత్నాలను భారత హాకీ డిఫెన్స్ విజయవంతంగా తిప్పి కొట్టింది. ఇంతకుముందు 2004, 2008, 2014 టోర్నీల్లో జూనియర్ ఆసియా కప్ కైవసం చేసుకున్న టీమిండియాకి ఇది నాలుగో ఆసియా కప్...
‘మాకు వచ్చిన అవకాశాలను చక్కగా వాడుకున్నాం. అయితే మేం మరిన్ని గోల్స్ ఈజీగా చేసేవాళ్లం. అయితే పాకిస్తాన్ లాంటి టీమ్‌తో ఫైనల్ ఆడుతున్నప్పుడు ప్లేయర్లపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అందుకే చాలా అవకాశాలను గోల్స్‌గా మలచలేకపోయాం. అయితే కుర్రాళ్లు తమ ఎమోషన్స్‌ని దాటి విజయాన్ని అందుకున్నందుకు గర్వంగా, సంతోషంగా ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు జూనియర్ భారత హాకీ టీమ్ కోచ్ సీఆర్ కుమార్..