టీ20 వరల్డ్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ పై ఐసిసి(ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) కీలక నిర్ణయం తీసుకుంది. 2020 లో ఆస్ట్రేలియా వేదికగా ప్రంపంచ దేశాల మధ్య జరగనున్న ఈ టోర్నమెంట్ పేరును  మారుస్తూ ఐసిసి నిర్ణయం తీసుకుంది. ఇకపై టీ20 వరల్డ్ ఛాపియన్ షిప్ పేరుతో కాకుండా టీ20 వరల్డ్ కప్ పేరుతో టోర్నీని నిర్వహించనున్నట్లు ఐసిసి వెల్లడించింది.

ఇప్పటికే టీ20 మ్యాచ్ లకు క్రికెట్ అభిమానుల నుండి మంచి ఆదరణ వస్తోన్న విషయం తెలిసిందే. వీటి రాకతో టెస్టులే కాదు వన్డే మ్యాచ్ లు కూడా ఆదరణ కోల్పోయాయి. దీంతో భవిష్యత్ క్రికెట్ మొత్తం టీ20 దేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో  అంతర్జాతీయ టీ20 టోర్నీల్లో చేపట్టాల్సిన మార్పులపై ఐసిసి సమావేశమై కీలక నిర్ణయాలు ప్రకటించింది.

వన్డే పార్మాట్ లో ప్రపంచ దేశాల మధ్య జరిగే టోర్నమెంట్ ను  వరల్డ్ కప్ పేరుతో నిర్వహిస్తోంది ఐసిసి. ఈ పేరు స్పురించేలా ఉండేందుకు ప్రంపంచ దేశాలు పాల్గొనే టీ20 టోర్ని పేరును కూడా టీ20 ప్రంపంచ కప్ గా మార్చినట్లు తెలుస్తోంది. 

ఐసిసి నిర్ణయంతో ఆస్ట్రేలియాలో 2020 లో నిర్వహించే పేరుషుల టీ20 టోర్నిని ‘ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ 2020’గా, మహిళల టీ20 టోర్నీని ‘ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ 2020’ గా పిలవనున్నారు.