వెస్టిండిస్ తో జరుగుతున్న టెస్ట్ సీరిస్ లో తెలుగు క్రికెటర్ హనుమ విహారి సత్తా చాటుతున్నాడు. మొదటి టెస్ట్ లో తృటిలో సెంచరీని(93 పరుగులు) మిస్సయిన విహారి రెండో టెస్ట్ లో ఆ పని కానిచ్చాడు. లోయర్ ఆర్డర్ సాయంతో అతడు తన కెరీర్లోనే మొదటి శతకాన్ని(111 పరుగులు) పూర్తిచేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా విహారి పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. 

రెండో రోజు ఆట ముగిసిన తర్వాత విహారి మీడియాతో మాట్లాడుతూ తన సెంచరీ అనుభవాన్ని పంచుకున్నాడు. తన 12వ ఏటనే తండ్రి చనిపోయాడని తెలిపి అతడు  భావోద్వేగానికి గురయ్యాడు. అయితే ఆ బాధను దిగమింగుకుంటూనే తన కెరీర్ పై దృష్టిపెట్టాను. అంతర్జాతీయ స్థాయిలో రాణించి తన మొదటి శతకాన్ని ఆయనకే అంకితమివ్వాలని నిర్ణయించుకున్నా. అందువల్లే ఈ సెంచరీ ఆయనకే అంకితమని విహారి వెల్లడించాడు. 

మొదటి ఇన్నింగ్స్ లో 302పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన సమయంలో విహారి లోయర్ ఆర్డర్ తో కలిసి పోరాడి మరో వంద పరుగులు జోడించాడి. ఈ క్రమంలోని టీమిండియా 416 పరుగులు చేయగా విహారి సెంచరీని పూర్తిచేసుకున్నాడు.  ముఖ్యంగా బౌలర్ ఇషాంత్ శర్మ హాఫ్ సెంచరీ(57 పరుగులు) తో విహారికి చక్కటి సహకారం అందించాడు. విహారి కేవలం 200 బంతుల్లో 100 పరుగులను పూర్తిచేసుకుని సత్తా చాటాడు. 

మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో కూడా విహారీ అద్భుతంగా ఆడాడు. వైస్ కెప్టెన్ అజింక్య రహానేకు తోడుగా నిలిచి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే 93 పరుగలతో సెంచరీకి చేరువైన అతడు తృటిలో సెంచరీని మిస్సయ్యాడు. కానీ రెండో టెస్టులో మాత్రం అన్నీ కలిసిరావడంతో సెంచరీని పూర్తిచేసుకోగలిగాడు. 

రెండో టెస్ట్ లో టీమిండియా విజయం ఖాయంగా కనిపిస్తోంది. కోహ్లీ సేన ఫస్ట్ ఇన్నింగ్స్ లో 416 పరుగులకు ఆలౌటవగా విండీస్ కేవలం 87 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి చిక్కుల్లోపడింది. ఇలా రెండో రోజు కూడా భారత  ఆధిక్యమే కొనసాగింది. ఇలా రెండోరోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 329 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంలో ఉంది.