హైరదబాదీ మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ పర్సనల్ మెయిల్ హ్యాక్ చేసి...బ్యాంక్ ఖాతాలోంచి డబ్బులు మాయం చేసిన సైబర్ నేరగాడికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. 2014 లో జరిగిన ఈ సైబర్ మోసంపై ఇవాళ కోర్టు తీర్పు వెలువరించింది. సైబర్ నేరగాడికి జైలుశిక్షతో పాటు రూ.40 వేల జరిమానా విధిస్తూ కూకట్ పల్లి న్యాయస్ధానం తీర్పు వెలువరించింది. 

ఈ సైబర్ దాడికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ లో నివాసముంటున్న మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కు ఎస్ఆర్ నగర్‌లోని డిసిబి బ్యాంకులో ఖాతా వుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలను ఆయన తన పర్సనల్ మెయిల్ లో పొందుపరుస్తుండేవాడు. దీన్ని కోల్ కతాకు చెందిన సైబర్ నేరగాడు రెజ్బానుల్‌ హక్‌ అదునుగా తీసుకున్నాడు. 

2014లో లక్ష్మణ్ కు సంబంధించిన మెయిల్ ను హ్యాక్ చేసిన రెజ్బానుల్ అందులోని బ్యాంకు వివరాలను తెలుసుకున్నాడు. వీటి ద్వారా బ్యాంకు అధికారులను సంప్రదించి రూ.10 లక్షల  నగదును తన ఖాతాలోకి మార్చుకున్నాడు. 

తన బ్యాంకు అకౌంట్లోంచి డబ్బులు వేరే అకౌంట్లోకి బదిలీ అయినట్లు గుర్తించిన లక్ష్మణ్ బ్యాంకు అధికారులను సంప్రదించాడు. అయితే ఇది సైబర్ నేరగాళ్ల పనిగా తేలడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఈ  వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసులు కోల్‌కతాలోని సాల్ట్‌లేక్‌ బ్యాంకులోని ఓ కంపనీ ఖాతాకు డబ్బులు బదిలీ అయినట్లు గుర్తించారు. అక్కడి పోలీసుల సాయంతో సైబర్ నేరగాడు రెజ్బానుల్‌ హక్‌ ను పట్టుకుని హైదరాబాద్ కు తీసుకువచ్చారు. ఇలా నిందితుడిని పట్టుకున్న గత ఐదేళ్లుగా విచారణ కొనసాగుతూనే వుంది. 

ఇవాళ ఈ కేసుపై మరోసారి విచారణ జరిపిన కూకట్ పల్లి కోర్టు నిందితుడిపై మోపబడిన ఆరోపణలు నిజమని తేల్చింది. ఇందుకు గాను అతడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.40వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.