Asianet News TeluguAsianet News Telugu

ఆట బాగోలేదని కోచ్‌ని మారిస్తే... సరిపోతుందా! పీవీ సింధు నిర్ణయంపై ఫ్యాన్స్ రియాక్షన్...

పరాజయాలు ఎదురైనప్పుడల్లా కోచ్‌లను మార్చడం అలవాటుగా మార్చుకున్న పీవీ సింధు... పుల్లెల గోపిచంద్ నుంచి కిమ్ జి యున్, తాజాగా పార్క్ టే సంగ్‌‌లపై వేటు... భారత బ్యాడ్మింటన్ స్టార్ నిర్ణయంపై మిశ్రమ స్పందన.. 

Hyderabad Badminton player PV Sindhu vs park tae sang, shuttle fans reaction on her decision cra
Author
First Published Feb 25, 2023, 4:30 PM IST | Last Updated Feb 25, 2023, 4:30 PM IST

భారత బ్యాడ్మింటన్ ప్రపంచంలో పీవీ సింధు ఓ సంచలనం. అనితర సాధ్యమైన విజయాలు అందుకుని, టీమిండియాకి ‘గోల్డెన్ గర్ల్’గా మారింది తెలుగు తేజం సింధు. భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ ట్రెయినింగ్‌లో వెలుగులోకి వచ్చిన పీవీ సింధు, ఆ తర్వాత దక్షిణ కొరియా మాజీ బ్యాడ్మింటన్ దిగ్గజం కిమ్ జి యున్ కోచింగ్‌లో రాటు తేలింది.

కిమ్ జి యున్ కోచ్‌గా ఉన్న సమయంలోనే పీవీ సింధు, బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ గెలిచింది. భారత్‌కి దక్కిన మొట్టమొదటి వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఇదే. అయితే కిమ్ జి యున్ అనారోగ్యానికి గురి కావడంతో భారత బ్యాడ్మింటన్ కోచ్ బాధ్యతల నుంచి అర్ధాంతరంగా తప్పుకుందామె... నిజానికి ఆమెని తప్పించడానికి సింధుయే కారణమని ఆరోపణలు కూడా చేసింది కిమ్ జి యున్.

ఆ తర్వాత దక్షిణ కొరియాకి చెందిన మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ పార్క్ టే సంగ్‌ని కోచ్‌గా నియమించుకుంది. పార్క్ టే సంగ్ గైడెన్స్‌లో 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన పీవీ సింధు, 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించింది.. అయితే కొన్నాళ్లుగా ముఖ్యంగా 2022 నుంచి వరుస పరాజయాలతో సతమతమవుతున్న పీవీ సింధు, పార్క్ టే సంగ్ మధ్య మనస్పర్థలు, విభేదాలు వచ్చినట్టు సమాచారం..

ఇంతకుముందు ముందు ఇలాగే భారత బ్యాడ్మింటన్ కోచ్‌ పుల్లెల గోపిచంద్‌తో గొడవ పడిన పీవీ సింధు, ఎవరికీ చెప్పకుండా సింగపూర్‌ వెళ్లింది. అయితే అలాంటిదేమీ లేదని ఓ పార్టీలో పాల్గొనడానికి తాను సింగపూర్‌కి వచ్చినట్టు తెలిపింది పీవీ సింధు. ఆ సమయంలో ఈ విషయం గురించి చాలా పెద్ద రచ్చే జరిగింది...

ఇప్పుడు కూడా ఇలాగే 2022 ఏడాదిలో వరుస వైఫల్యాలతో విసిగిపోయిన పీవీ సింధు, తన ఆటను మరింత మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టకుండా  కోచ్‌ని మార్చేసింది. పార్క్ టెక్నిక్‌లో కానీ అంతకుముందు సింధుకి బ్యాడ్మింటన్ పాఠాలు నేర్పిన మిగిలిన గురువుల టెక్నిక్‌లో కానీ లోపాలు ఉండి ఉంటే... ఆమె ఇంత పెద్ద బ్యాడ్మింటన్ స్టార్ అయ్యేది కాదు...

అయితే వరుస పరాజయాలు ఎదురైనప్పుడల్లా తన ఆటలోని తప్పులను సరిదిద్దుకోవాల్సి పోయి, కోచ్‌లపై వేటు వేస్తోంది పీవీ సింధు. ఇది కరెక్ట్ కాదని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే..  పీవీ సింధు కోచ్‌ని మార్చిన ప్రతీసారీ ఆమెకి విజయాలే దక్కాయని గుర్తుచేస్తున్నారు మరికొందరు బ్యాడ్మింటన్ అభిమానులు...

వ్యాపారంలో కానీ ఆటలో ఎమోషన్స్ ఉండకూడదు, ఎందుకంటే వ్యక్తులతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయితే విజయాలు రావు... సైనా నెహ్వాల్ స్టార్‌గా ఎదిగిన తర్వాత ఆ విజయాలను కొనసాగించలేకపోయింది కూడా ఇందుకే. సైనా నెహ్వాల్‌ నుంచి పాఠాలు నేర్చుకుని పీవీ సింధు, కోచ్‌ల విషయంలో అమలు చేస్తున్న ఫార్ములా కూడా ఇదే.

జనాలకు సినిమాల్లో సెంటిమెంట్స్ కావాలేమో కానీ.. ఆటలో అవేమీ అవసరం లేదు. ఆటలో వారికి కావాల్సింది విజయాలు మాత్రమే. అది ఏ కోచ్ సాధించినా, కోచ్ లేకుండా సాధించినా వారికి సంతోషమే. అయితే ఆమె మాజీ కోచ్‌లు మాత్రం భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ చేసిన పనిని తప్పుబడుతున్నారు... 

క్రికెట్‌లో వరుస పరాజయాలు వస్తే హెడ్ కోచ్‌ని మారుస్తారు. అయినా ఓటములు ఎదురైతే ప్లేయర్లనే మారుస్తారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ వీలైనంత త్వరగా ఈ లాజిక్‌ని అర్థం చేసుకుని, తనలోని తప్పులను కూడా తెలుసుకుంటే బెటర్ అంటున్నారు ఇంకొందరు అభిమానులు.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios