Asianet News TeluguAsianet News Telugu

సాగర తీరం.. రేసింగ్ సమరం.. బుద్దుడి చుట్టూ భ్రమణం.. ‘ఫార్ములా ఈ రేసు’ విశేషాలివే..

Formula E Race: భాగ్యనగరంలో మరో అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ కు రంగం సిద్ధమైంది.  భారత్ లోనే తొలిసారిగా  ఫార్ములా ఈ రేసుకు సన్నాహకాలు పూర్తయ్యాయి. ఎలక్ట్రానిక్ వెహికిల్స్ లో  రేసింగ్ కార్లు   బుద్దుడి చుట్టూ తిరగనున్నాయి. 

Hyderabad All Set For Formula E Race 2023, Here is The Interesting Details MSV
Author
First Published Feb 9, 2023, 12:04 PM IST

ఫార్ములా రేసింగ్..  భారత్‌లో అనుకున్న స్థాయిలో  సక్సెస్  కాని క్రీడల్లో ఇది కూడా ఒకటి. క్రికెట్‌ను ఒక మతంగా  భావించే  భారత్ లో  కార్ రేసింగ్ లు అంటే ‘అదేదో వీడియో గేమ్, చిన్నపిల్లలు ఆడుకునే కంప్యూటర్ గేమ్స్’అనే భావన ఉండేది. కారణాలేవైనా  భారత్ లో ఫార్ములా రేసింగ్ సక్సెస్ కాలేదు. కానీ ఆ కొరతను తీర్చడానికి ఇప్పుడు హైదరాబాద్ కు  అత్యంత ప్రతిష్టాత్మకమైన  ఫార్ములా ఈ రేసు  దూసుకొచ్చింది.  హుస్సేన్ సాగర తీరంలో   రేసింగ్ కార్లు  బుద్దుడి చుట్టూ పరిభ్రమించబోతున్నాయి. ఈ నేపథ్యంలో  అసలు ఈ రేసింగ్ ఏంటి..?   అది ఎలా ఉండబోతుంది..?  షెడ్యూల్ ఏంటి..? తదితర వివరాలు ఇక్కడ చూద్దాం. 

భారత్ లో ఫార్ములా రేసింగ్  జరిగి దాదాపు పదేండ్లు కావస్తోంది.  2012లో ఢిల్లీ వేదికగా    ఫార్ములావన్  (ఎఫ్1) రేసును నిర్వహించారు.  ఢిల్లీ బుధ్ సర్క్యూట్ లో రేసింగ్ కార్లు రయ్ రయ్ మని దూసుకుపోయాయి.  కానీ  మూడేండ్ల తర్వాత మళ్లీ వాటి  ఊసే లేదు. ఇప్పుడు  మన హైదరాబాద్ లో   మళ్లీ కార్లు దూసుకుపోతున్నాయి.  అయితే ఇవి గతంలో జరిగిన ఎఫ్1  మాదిరి రేసు వంటివి కాదు.  ఎలక్ట్రానిక్ వెహికిల్స్ తో నడిచే  కార్లు. 

ఏంటీ ఫార్ములా ఈ రేసు..? 

సాధారణ రేసింగ్ కార్ల మాదిరిగా కాక ఎలక్ట్రిక్  కార్లతో  ఈ రేసింగ్ జరుగబోతున్నది.   కర్భన ఉద్గారాలను తగ్గించి ఎలక్ట్రిక్ వెహికిల్స్ పై ప్రజల్లో అవగాహన పెంచడమే దీని ప్రధాన ఉద్దేశం.  పర్యావరణ  హితం కోరుతూ   ఆయా దేశాలు ‘గో గ్రీన్’ పేరిట ఎఫ్1 రేసుల స్థానంలో ‘ఫార్ములా ఈ రేసు’లను ప్రోత్సహిస్తున్నాయి.  పెట్రోల్, డీజిల్ కార్ల వాడకాన్ని తగ్గించడం కూడా   దీని ప్రధాన ఉద్దేశం. 

ఈ పోటీల గురించి.. 

ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగనున్న పోటీలు 9వ సీజన్ కు సంబంధించినవి.   ప్రతి సీజన్ లో  16 రేసులు ఉంటాయి. హైదరాబాద్ లో జరుగబోయేది నాలుగో రేస్.  తొలి మూడు రేస్ లు  మెక్సికో, దిరియా  (సౌదీ లో రెండు రేస్ లు)  జరిగాయి. హైదరాబాద్ లో జరిగేది నాలుగోది.  మిగిలినవి  కేప్‌టౌన్,  సావోపాలో, మొనాకో, బెర్లిన్, జకర్తా,  పోర్ట్ లాండ్, రోమ్, లండన్ లో జరుగుతాయి. 

షెడ్యూల్ ఏంటి..? 

ఫిబ్రవరి 10 నుంచి పోటీలు ప్రారంభం కాబోతున్నాయి.  ఫిబ్రవరి 10,  11న ప్రీ ప్రాక్టిస్ పోటీలు ఉంటాయి.  శనివారం మధ్యాహ్నం అసలు పోరు మొదలుకానుంది. 
- ఫిబ్రవరి 10 : ప్రీ ప్రాక్టీస్ 1  - సాయంత్రం 4.25 గంటలకు 
- ఫిబ్రవరి 11 : ప్రీ ప్రాక్టీస్ 2 - ఉదయం 8.05 గంటలకు 
- ఫిబ్రవరి 11 :  క్వాలిఫైయింగ్ - ఉదయం 10.40 గంటలకు 
- ఫిబ్రవరి 11 :  ప్రధాన రేస్ - మధ్యాహ్నం 3.03 గంటలకు  

ఎక్కడ జరుగనుంది..? 

ఒకప్పుడు జంట నగరాలకు  తాగు నీరు అందించిన  జలాశయం హుస్సేన్ సాగర్  చుట్టూ ఈ రేసు జరుగుతుంది.   ట్యాంక్ బండ్ చుట్టూ  ఉండే  2.8 కిలోమీటర్ల  ట్రాక్ పై   ఎలక్ట్రానిక్ కార్లు దూసుకుపోనున్నాయి.  స్ట్రీట్ సర్క్యూట్ గా పిలిచే ఈ ట్రాక్ పై  మొత్తంగా 18 మలుపులు ఉన్నాయి.  

 

పాల్గొనబోయే జట్లు.. 

- ఈ రేస్ కు  11 జట్లకు చెందిన  22 మంది డ్రైవర్లు పోటీలో ఉన్నారు.  భారత్ నుంచి  ‘మహీంద్ర టీమ్’   పోటీలో ఉంది.  ఈసారి మహీంద్ర టీమ్ నుంచి ఒలివర్ రోలండ్, ల్యూకాస్ గ్రాసి డ్రైవర్లుగా  వ్యవహరిస్తున్నారు.   

ప్రేక్షకుల కోసం  ఏర్పాట్లు.. 

భాగ్యనగర ప్రేక్షకులే గాక  దేశ, విదేశాల నుంచి  అభిమానులు వస్తుండటంతో  ట్యాంక్ బండ్ చుట్టూ  ప్రేక్షకులు ఈ రేస్ ను చూడటానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. పర్మనెంట్ గ్యాలరీలు కూడా  సిద్ధమయ్యాయి.   సుమారు 25 వేల మంది  ఈ రేస్ చూడటానికి వస్తారని  అంచనా వేస్తున్నారు.  కాగా ఈ రేస్ కోసం ఆన్ లైన్ వేదికగా అందిస్తున్న టికెట్లు కూడా దాదాపుగా అమ్ముడుపోయినట్టు సమాచారం.  వెయ్యి, నాలుగు వేలకు సంబంధించిన  గ్రాండ్ స్టాండ్ టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి.  ప్రీమియమ్ గ్రాండ్ స్టాండ్ (రూ. 7 వేలు), ఏస్ గ్రాండ్ స్టాండ్ (రూ. 10,500) టికెట్లు మాత్రం ఇంకా అందుబాటులోనే ఉన్నాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios