కోహ్లీ స్థానాన్ని తనకి ఇవ్వమని రోహిత్ శర్మని.. యువ క్రికెటర్ చాహల్ కోరుతున్నాడు. కోహ్లీ స్థానం చాహల్ అడగటం ఏమిటా అనుకుంటున్నారా..? ఇంతకీ మ్యాటరేంటంటే...న్యూజిలాండ్ తో జరిగిన ఐదు వన్డేలో భారత్ సిరిస్ ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.  ఆదివారం జరిగిన ఐదో వన్డేలో భారత్ 35పరుగుల తేడాతో గెలుపొంది చరిత్ర సృష్టించింది.  

కాగా.. హామిల్టన్ వేదికగా జరిగిన నాల్డో వన్డేలో మాత్రం భారత్ ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ లో టీం ఇండియా 92 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. ఆ మ్యాచ్ లో చాహల్ ఒక్కడే అత్యధికంగా 18 పరుగులు చేశాడు.

అయితే.. ఐదో వన్డే విజయం తర్వాత చాహల్ టీవీ యాంకర్ అవతారం ఎత్తాడు. విజయానందంలో ఉన్న రోహిత్ శర్మని చాహల్ ఇంటర్వ్యే చేశాడు. కివీస్ పై వన్డే సిరీస్ గెలుచుకోవడం ఎలా ఉందని ముందుగా రోహిత్ ని చాహల్ ప్రశ్నించాడు. అనంతరం తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చాల్సిందిగా రిక్వెస్ట్ చేశాడు. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానంలో బ్యాటింగ్ కి తనని పంపాలని చాహల్ ఈ సందర్భంగా రోహిత్ ని కోరాడు.

‘ కివీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో నన్ను మూడో స్థానంలో  బ్యాటింగ్‌కు దింపుతావా రోహిత్‌ భయ్యా. కోహ్లి గైర్హాజరీ కారణంగా ఆ స్థానాన్ని నాకు కేటాయించు’ అని చహల్‌ జోక్‌ చేశాడు. దీనికి రోహిత్‌ శర్మ బదులిస్తూ.. ‘నాల్గో వన్డేలో నువ్వు టాప్‌ స్కోరర్‌గా నిలిచావ్‌. అంతవరకూ ఓకే కానీ ఆ మ్యాచ్‌ ఓడిపోయింది కదా. అయినా నీ విజ్ఞప్తిని పరీశిలిస్తాం. నిన్ను మూడో స్థానంలో పంపడానికి కోచ్‌ రవిశాస్త్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా’ అని మరింత సరదాగా మాట్లాడాడు.