మా అనుమతి లేకుండా టీషర్టులు తొలగించి అక్కడ చేయి వేసేవాడు : బ్రిజ్ భూషణ్‌పై రెజ్లర్ల తీవ్ర ఆరోపణలు
Wrestlers Protest: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఉచ్చు బిగుస్తోంది.
‘నేను నేలమీద పడుకుని ఉన్నా. బ్రిజ్ భూషణ్ నా దగ్గరకి వచ్చి నా అనుమతి లేకుండా నా టీషర్ట్ లాగాడు. నా శ్వాస చెక్ చేస్తున్నాననే నెపంతో తన చేతిని నా ఉదర భాగంలో ఉంచాడు. అంతేగాక తన చేతిని నా చాతి భాగానికి తీసుకొచ్చాడు..’ అంటూ ఓ మహిళా రెజ్లర్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న బ్రిజ్ భూషణ్ పై ఇటీవల ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఎఫ్ఐఆర్ లో విస్తుపోయే విధంగా మహిళా రెజ్లర్లు ఆరోపణలు చేశారు.
ఎఫ్ఐఆర్లో పలువురు రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ తమతో వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ రెజ్లర్ ఔట్ డోర్ కాంపిటీషన్ లో గాయపడగా ఆమె వైద్యానికి సాయం చేయాలంటే తనకు లైంగికంగా సాయం చేయాలని బ్రిజ్ భూషణ్ చెప్పినట్టు పేర్కొంది.
మరో రెజ్లర్.. ‘నేను ఓసారి భోజనం చేద్దామని డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నా. అప్పుడు బ్రిజ్ భూషణ్ నా దగ్గరికి వచ్చి నా డైటీషియన్ అనుమతి, నా అంగీకారం లేకుండానే ఓ పదార్థాన్ని నాతో తినిపించాడు. అది తింటే నాకు ఆరోగ్యం, నా పర్ఫార్మెన్స్ మీద కూడా ప్రభావం చూపుతుందని చెప్పాడు. ఇదే అదునుగా నా కడుపును కూడా టచ్ చేశాడు..’అని పేర్కొంది.
మరో యువతి.. ‘ఒకసారి మేం ఫోటో దిగేప్పుడు బ్రిజ్ భూషణ్ తన చేతులతో నా వెనుక భాగాన్ని అసభ్యకరంగా తాకాడు. నేను దాని నుంచి తప్పించుకుని ముందుకు వెళ్తుంటే నా భుజం మీద చేయి వేశాడు..’అని కంప్లయింట్ ఇచ్చింది.
భారత్ తరఫున అవార్డులు గెలుచుకున్న ఓ ప్రముఖ క్రీడాకారిణి అయితే.. ‘బ్రిజ్ భూషణ్ ఓసారి నాకు ఫోన్ చేసి డిన్నర్ చేసేందుకు గాను రెస్టారెంట్ కు రమ్మన్నాడు. నేను అక్కడికి వెళ్లగానే నా అనుమతి లేకుండానే నా రొమ్ముపై చేయి వేశాడు. నన్ను గట్టిగా పట్టుకుని పదే పదే ఛాతి, కడుపు భాగంలో టచ్ చేశాడు..’ అని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. మరో రెజ్లర్ అయితే.. ‘రెజ్లింగ్ ఆడేందుకు నాకు కొన్ని పరికరాలు కొనేందుకు అవసరం కాగా అందుకు సాయం చేయాలంటే బ్రిజ్ భూషణ్ తన లైంగిక కోరికలు తీర్చాలని పట్టుబట్టాడు..’అని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.