న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో భారత ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా తన విశ్వరూపాన్ని చూపించాడు. కివీస్ బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు విఫలమవ్వడంతో రాయుడు-విజయ్ శంకర్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది.

ఆ తర్వాత వారిద్దరూ ఔటవ్వడంతో స్కోరు 200 దాటుతుందా అనుకుంటున్న సమయంలో పాండ్యా రంగ ప్రవేశం చేశాడు. వచ్చి రావడంతోనే న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీ దాటించాడు.

ముఖ్యంగా ఆస్లే వేసిన 47వ ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సర్లతో చెలరేగాడు. కేవలం 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు. పాండ్యా దూకుడుతో భారత్ 250 పరుగులు దాటింది.

అతని వీరవిహారం చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  ‘‘ఏంటి పాండ్యా బంతిని కరణ్ జోహర్ అనుకున్నావా..? అంత కసిగా కొట్టావ్’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘‘కాఫీ విత్ కరణ్’’ షోకి హాజరైన టీమిండియా క్రికెటర్లు హార్డిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లు మహిళలను ఉద్దేశించి అసభ్యకరంగా వ్యాఖ్యానించారు. దీనిపై సోషల్ మీడియాలో మహిళా సంఘాలు ఫైరయ్యాయి.

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ పాండ్యా, రాహుల్‌పై నిషేధం విధించింది. అయితే మాజీ క్రికెటర్లతో పాటు అభిమానుల నుంచి ఒత్తిడి రావడంతో నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ దర్యాప్తును కొనసాగిస్తోంది. అయితే కరణ్ జోహర్ పిచ్చి ప్రశ్నల వల్లే పాండ్యా నోరు జోరారని కొందరు అభిమానులు మద్దతుగా ట్వీట్ చేశారు.

ఐదో వన్డే: పోరాడిన న్యూజిలాండ్...వెల్లింగ్టన్‌లో భారత్ విజయం