న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ నాటికి తాను జట్టు మారతానే ప్రచారాలాను చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌ స్పందించాడు. జట్టు మారే ఆలోచన తనకు లేదని, ఒకవేళ మారే పక్షంలో ముందుగానే చెబుతానని చెప్పాడు. 

తాను జట్టు మారడానికి ప్రయత్నిస్తున్నట్లు చెలరేగుతున్న పుకార్లలో వాస్తవం లేదని అన్నాడు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచీ 10 సీజన్లు ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడిన హర్భజన్ గత సీజన్‌లో చెన్నై జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.

ఎంఎస్ ధోని నేతృత్వంలోని సీఎస్‌కే.. ఐపీఎల్ 11 ట్రోఫీని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ -12లో హర్భజన్ ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఆడతాడని, అలా కుదరకపోతే ఆ జట్టు మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తాడని ఇటీవల ప్రచారం జరిగింది. 

అయితే అలాంటి వదంతులు నమ్మవద్దని భజ్జీ కోరాడు. 'చెన్నై జట్టులో తనకు ఏ విధమైన ఇబ్బంది లేదని, గొప్ప ఫ్రాంచైజీకి ఆడటాన్ని గౌరవంగా భావిస్తానని చెప్పాడు.