ఇంగ్లాండుపై నాలుగో టెస్టు మ్యాచులో ఓడిపోయిన తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపైనా కోచ్ రవిశాస్త్రిపైనా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. సౌతాంప్టన్ టెస్టు మ్యాచు ఓటమి తర్వాత హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ ప్రతిభపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  భారత్ కోహ్లీ బ్యాటింగ్ పై ఎక్కువగా ఆధారపడడాన్ని కూడా ఆయన తప్పు పట్టాడు.

టెస్టు సిరీస్ ను కోల్పోయిన నేపథ్యంలో గవాస్కర్ కోహ్లీపై మండిపడ్డాడు. ఇంగ్లాండుపై టెస్టు సిరీస్ ఫలితంతో ప్రతి ఒక్కరూ నిరాశకు గురయ్యారని, కోహ్లీ పగ్గాలు చేపట్టిన తర్వాత భారత క్రికెట్ కొత్త దిశగా పయనిస్తుందని అందరూ ఆశించారని, విజయాల కోసం జట్టు దాహం గొన్నట్లుగా కనిపించిందని, మరింత జోష్ పెరుగుతుందని భావించారని ఆయన ఓ క్రికెట్ మీడియా సంస్థతో అన్నారు. 

దక్షిణాఫ్రికా, ఇంగ్లాండు, వచ్చే ఆస్ట్రేలియా పర్యటనలు అతి కష్టమైనవని అందరికీ తెలుసునని, అయితే శ్రీలంక, వెస్టిండీస్ ప్రాక్టీస్ పర్యటనలాగా టీమిండియా మార్చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. 

మరో బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీలాగా ఆడి ఉంటే ఇంగ్లాండు, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ లను ఓడిపోయి ఉండేవాళ్లం కాదని అన్నాడు. ఇంగ్లాండు పర్యటనలో కోహ్లీ కొన్ని రికార్డులను బద్దలు కొట్టినప్పటికీ కెప్టెన్ గా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉందని గవాస్కర్ అన్నాడు. 

అయితే, ఇంగ్లాండు టెస్టు సిరీస్ ఓటమికి రవిశాస్త్రిని, కోచింగ్ సిబ్బందిని నిందించడానికి ఆయన నిరాకరించాడు. ఆటగాళ్లు వ్యక్తిగతంగా ఎందుకు ఎదగలేకపోతున్నారనే విషయాన్ని చూడాల్సి ఉంటుందని అన్నాడు.