భారత జవాన్లను టార్గెట్ గా చేసుకుని జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు భారీ హింసకు తెగబడ్డారు. జమ్మూ నుండి శ్రీనగర్ వెళుతున్న ఆర్మీ వాహనాలపై సూసైడ్ బాంబులతో దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 42 మంది సీఆర్‌ఫిఎఫ్ జవాన్లు మృతిచెందగా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై టీంఇండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ సీరియస్ గా రియాక్టయ్యారు.  

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడిపై ట్విట్టర్ ద్వారా గంభీర్ ఈ విధంగా స్పందించారు.'' అవును, ఇక కశ్మీర్ వేర్పాటువాదులతో చర్చలు జరుపుదాం. పాకిస్థాన్ తో కూడా చర్చలు జరుపుదాం. కానీ ఈసారి టేబుల్ చర్చలు కాకుండా యుద్దభూమిలోనే సమాధానం చెబుదాం. మరోసారి ఇలా మన సైనికులను టార్గెట్ చేయకుండా గట్టిగా జవాబిద్దాం''అంటూ గంభీర్ సీరియస్ అయ్యారు. 

సీఆర్పీఎఫ్ 54వ బెటాలియన్‌కి చెందిన సైనికులు 70 వాహనాల్లో జమ్ము- శ్రీనగర్ హైవేలో ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది. దాదాపు 350 కిలోల పేలుడు పధార్థాలతో కూడిన స్కార్పియోతో ఓ ఆర్మీ వాహనాన్ని ఢీకొట్టిన ముష్కరుడు తనను తాను పేల్చుకున్నాడు. అనంతరం రోడ్డు పక్కన కాపుకాచిన మరికొంతమంది ఉగ్రవాదులు తుపాకులతో, గ్రనేడ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో వాహనాల్లో ప్రయాణిస్తున్న జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.  
 
2016లో యూరి సైనిక స్థావరంపై జరిగిన దాడి తర్వాతే మళ్లీ అంతపెద్ద ఎత్తున జరిగిన ఉగ్రవాదుల దాడి ఇదే. 2004 తర్వాత జరిగిన అత్యధికంగా సైనికులను కోల్పోయిన  అతిపెద్ద దాడి కూడా ఇదేనని మిలటరీ వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ  ప్రకటించింది.