దేశ రాజధాని డిల్లీలో టీంఇండియా మాజీ క్రికెటర్ అమిత్ భండారిపై జరిగిన దాడిని మరో మాజీ ఆటగాడు గౌతం గంభీర్ తీవ్రంగా ఖండిచారు. ఆయనపై దాడికి పాల్పడిన ఆటగాళ్లందరిని క్రికెట్ నుండి బహిష్కరించాలని గంభీర్ సూచించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరక్కండా వుండాలంటే ఈ దాడికి పాల్పడిన యువ క్రికెటర్‌ని కఠినంగా శిక్షించాలని గంభీర్ డిమాండ్ చేశారు. 

టీంఇండియా మాజీ పేస్ బౌలర్ అమిత్ భండారీ ప్రస్తుతం ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్‌(డిడిసీఏ) సెలక్షన్‌ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. అయితే డిల్లీ అండర్-23 జట్టుకోసం డిల్లీలోని సెయింట్ జోసెఫ్ మైదానంలో ఆటగాళ్ల ఎంపిక జరుగుతుండగా అతడిపై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు,సైకిల్ చైన్లతో  దాడి చేయడంతో అమిత్ తీవ్రంగా గాయపడ్డాడు. 

అయితే అమిత్ భండారిపై అనూజ్ దేడా అనే యువ క్రికెటర్ దాడి చేయించినట్లు పోలీసులు గుర్తించారు. తనను డిల్లీ  అండర్-23 జట్టులో స్థానం కల్పించకపోవడంతో అనూజ్ తన స్నేహితులతో కలిసి అమిత్‌పై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో అనూజ్ దేడాతో పాటు అతడి స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

తోటి క్రికెటర్‌పై జరిగిన దాడిపై డిల్లీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. దేశ రాజదాని డిల్లీలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని అన్నాడు.  కేవలం జట్టులో ఎంపిక చేయనందుకే ఇంత దారుణంగా దాడికి పాల్పడటం అమానుషమని పేర్కొన్నాడు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించాడు. ఈ దాడితో సంబంధమున్న ఆటగాళ్ళందరిని క్రికెట్ నుండి బహిష్కరించాలని గంభీర్ డిమాండ్ చేశాడు.