ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ ఆసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి బిసిసిఐ పగ్గాలు దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.  లోధా సంస్కరణల్లో కొన్నింటికి సవరణలు చేసిన సుప్రీంకోర్టు బోర్డు నూతన రాజ్యాంగాన్ని ఇటీవల ఆమోదించింది. 

కొత్త రాజ్యాంగంలో కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌ను సవరించిన నేపథ్యంలో ప్రస్తుత, మాజీ అడ్మినిస్ర్టేటర్లు బీసీసీఐ అధ్యక్ష పదవికి అనర్హులవుతారు. దాంతో ఆ పదవిలో కొత్త వ్యక్తి రావడం తప్పనిసరి అవుతుంది. ఈ నేపథ్యంలో బోర్డు అధ్యక్ష పదవి ఎన్నికల్లో పలువురు మాజీ క్రికెటర్లకు అవకాశం ఉన్నాయి. అయితే వీరిలో ఎక్కువ అవకాశాలు గంగూలీకే ఉన్నట్టు క్రికెట్ వర్గాలంటున్నాయి.

నాలుగేళ్లుగా క్యాబ్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్న గంగూలీ బీసీసీఐ చీఫ్‌ పదవికి ప్రధాన పోటీదారు కానున్నాడు. క్యాబ్‌ వ్యవహారాలను సమర్థంగా నడిపిస్తుండడం అతనికి ప్లస్ పాయింట్ కానుంది. అదే సమయంలో బీసీసీఐ పలు నిర్ణయాలతో వివాదాస్పదం అవుతున్నస్థితిలో బోర్డు పాలనను గాడిలో పెట్టడం గంగూలీ వల్లనే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

కాగా, బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికైతే రెండేళ్ల తర్వాత గంగూలీ వైదొలగాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పటికి క్యాబ్‌ అధ్యక్ష పదవితో కలిసి గంగూలీ మొత్తం ఆరేళ్లు పూర్తి చేస్తాడు. ఎన్నిక ఏకగ్రీవమైతేనే గం గూలీ బరిలోకి దిగనున్నట్టు సమాచారం.