భారత జట్టు మాజీ ఆటగాడు, ప్రస్తుత ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్‌ సెలక్షన్‌ కమిటీ అధ్యక్షుడు అమిత్ భండారీపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు, సైకిల్ చైన్లతో అతడిపై దాడికి పాల్పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అమిత్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి తల భాగంలో  తీవ్రమైన గాయాలయ్యాయని డాక్టర్లు తెలిపారు. 

ఈ దాడికి సంబంధించిన డిడిసీఏ సహ సెలెక్టర్ సుఖ్వీందర్ సింగ్ స్పందిస్తూ.. న్యూడిల్లీలోని  స్టీఫెన్స్ ఘడ్ ఏరియాలో ఈ ఘటన జరిగిందన్నారు. కొంతమంది యువకుల ఒక్కసారిగా అమిత్ భండారీపై దాడికి పాల్పడినట్లు తెలిపారు. తాము ఈ దాడిని అడ్డుకోడానికి ప్రయత్నించినా యువకులు వినిపించుకోలేదని సుఖ్వీందర్ తెలిపారు.  

ఈ దాడి సమయంలో తానుకూడా అక్కడే వున్నట్లు డిల్లీ అండర్ 23 జట్టు మేనేజర్ శంకర్ సైనీ వెల్లడించాడు. డిల్లీ అండర్‌-23 జట్టు కోసం ఛీప్ సెలక్టర్ అమిత్ భండారీ ఆధ్యర్యంతో సెయింట్ జోసెఫ్ మైదానంలో ఆటగాళ్ల ఎంపిక జరుగుతుండగా ఈ ఘటన జరిగిందన్నారు. ఈ  సమయంలోనే  ఓ ఇద్దరు యువకులు భండారీతో వాగ్వివాదానికి దిగి వెళ్లిపోయారని తెలిపాడు. అనంతరం ఓ పది నిమిషాల తర్వాత వారిద్దరు ఓ గ్యాంగ్ తో వచ్చి దాడికి దిగినట్లు శంకర్ వివరించారు. 

ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు శంకర్ సైనీ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుుకుని దాడికి పాల్పడిన యువకుల కోసం  గాలిస్తున్నారు.