ప్రపంచ కప్ కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో తలపడే భారత జట్టును బిసిసిఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో టీ20 సీరిస్ కు ఎంపికైన సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తిక్ కు వన్డే జట్టులో అవకాశం లభించలేదు. వన్డే ప్రపంచ కప్ కు ముందు ఇలా దినేశ్ కార్తీక్ ను వన్డే సీరిస్ కు ఎంపికచేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకుని ఈ జట్టును ఎంపికచేశారు కాబట్టి ఇక కార్తిక్ పని అయిపోయినట్లేనని పలు కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఆ  అనుమానాలన్నీ నిజమవనున్నాయని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ప్రపంచ కప్ ఆడనున్న భారత జట్టులో దినేశ్ కు ఇక చోటు దక్కే అవకాశాలు లేవని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు సెలెక్టర్ తాజా నిర్ణయంతో అతడి వన్డే కెరీర్ ముగిసినట్లేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకనుంచి అతడు కేవలం టీ20 క్రికెట్ కే పరిమితమవ్వనున్నాడని మంజ్రేకర్ తన అభిప్రాయాన్ని వ్యక్తపర్చారు.

కార్తిక్ కు సెలెక్టర్లు చాలా అవకాశాలిచ్చారని...వాటిని అతడు సద్వినియోగం చేసుకోలేక పోయాడని మంజ్రేకర్ పేర్కొన్నాడు. న్యూజిలాండ్ సీరిస్ లో అంబటి రాయుడి  మాదిరిగా మ్యాచ్ ను మలుపుతిప్పే ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. కేవలం చివరి నిమిషంలో వచ్చి మ్యాచ్ ఫినిషింగ్ ఇన్నింగ్స్ ఆడితే సరిపోదన్నారు. ఈ విషయాలన్నింటిని పరిగణలోకి తీసుకుని ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సీరిస్ కు సెలెక్టర్లు అతన్ని పక్కనపెట్టి  వుంటారని మంజ్రేకర్ వివరించారు. 

అయితే వన్డే జట్టులో కార్తిక్ ను కాదని తీసుకున్న రిషబ్ పంత్ కూడా అద్భుతమైన ఆటగాడేమీ కాదని మంజ్రేకర్ అన్నారు. వన్డేల్లో అతడు ఇప్పటివరకు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి తనను తాను నిరూపించుకున్న సందర్భాలు లేవని గుర్తుచేశారు. అతడు తన సత్తా చాటితేనే భారత జట్టులో స్ధానం పదిలం చేసుకోగలడని మంజ్రేకర్ వెల్లడించారు.