టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్.. చాలా హీట్ మీద ఉన్నారు. టీం ఇండియాకు తొలి టీ20 వరల్డ్ కప్ అందించిన ధోనీని  వెస్టిండీస్, ఆస్ట్రేలియాలతో జరిగే టీ20 సిరీస్‌లకు ఎంపిక చేయకపోవడంపై అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ శుక్రవారం రాత్రి ఆలస్యంగా నాలుగు వేర్వేరు జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. 

విండీస్‌, ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌లకు ధోనిని ఎంపికచేయలేదు. ఇది అతని అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో సోషల్‌ మీడియా వేదికగా తమ అసహనాన్ని వెల్లగక్కుతున్నారు. ఇక భారత్‌ టీ20లు ఆడుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ధోని కేవలం 11 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడలేదు. 

అలాంటి ధోనిని పక్కకు పెట్టడం ఏంటని అతని అభిమానులు సెలక్షన్‌ కమిటీని నిలదీస్తున్నారు. చాలా పెద్ద తప్పు చేస్తున్నారని, ఈ నిర్ణయానికి తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నారు. 

‘విండీస్‌, ఆస్ట్రేలియాలతో జరిగే టీ20ల్లో ధోని ఆడబోవడం లేదు. మేము రెండో వికెట్‌ కీపర్‌ను పరీక్షించే ప్రయత్నంలో ఉన్నాం. ఈ విషయంలో పంత్, కార్తీక్‌ పోటీ పడతారు. అయితే టి20ల్లో ధోని కెరీర్‌ ముగిసిందని మాత్రం చెప్పలేను’ అని ఎమ్మెస్కే వివరణ ఇచ్చారు.  

దీంతో ఎమ్మెస్కేపై సైతం ధోని అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. కనీసం కెరీర్‌లో మూడు, నాలుగు మ్యాచ్‌లు కూడా ఆడని ఎమ్మెస్కే..ధోని లాంటి దిగ్గజ బ్యాట్స్‌మన్‌ గురించి నిర్ణయం తీసుకోవడం తమ కర్మని మండిపడుతున్నారు. మరికొందరు ధోని లేని లోటు ఎంటో వారికే తెలుసోస్తుందని కామెంట్‌ చేస్తున్నారు.