ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ లో భాగంగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో ఇంగ్లాండు చివరి జోడీ రషీద్, ఆండర్సన్ జోడీ భారత విజయాన్ని రేపటికి వాయిదా వేసింది. వికెట్ల వద్ద పాతుకుపోయిన రషీద్ చివరి వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. మంగళవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండు 9 వికెట్ల నష్టానికి 311 పరుగులుచ చేసింది. రషీద్ 30 పరుగులతో, ఆండర్సన్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు తీసుకోగా, ఇషాంత్ శర్మకు రెండు వికెట్లు దక్కాయి. షమీ, పాండ్యా చెరో వికెట్ తీసుకున్నారు. 

వికెట్ల వద్ద నిలదొక్కుకోవడానికి ప్రయత్నించిన రషీద్, బ్రాడ్ జోడీని విడగొట్టడం ద్వారా బుమ్రా మరోసారి కీలకమైన పాత్ర వహించాడు. రషీద్, బ్రాడ్ ఎనిమిదో వికెట్ భాగస్వామ్యానికి యాభై పరుగులను జోడించారు. ఈ స్థితిలో బౌలింగుకు దిగిన బుమ్రా వేసిన బంతిని బ్రాడ్ (20) రెండో స్లిప్ లో రాహుల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లాండు 291 పరుగుల వద్ద 9వ వికెట్ ను కోల్పోయింది.

జోష్ బట్లర్ సెంచరీ చేసి, బెన్ స్టోక్స్ అర్థ సెంచరీ చేసి భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కుంటున్న క్రమంలో బుమ్రా తన బంతులతో నిప్పులు చెరిగాడు. దాంతో బట్లర్ (106) బుమ్రా బౌలింగులో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అదే ఓవరులో బుమ్రా జానీ బెయిర్ స్టోను సున్నా పరుగులకే క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే వోక్స్ (4)ను బౌన్సర్ తో పల్టీ కొట్టించి బుమ్రా అవుట్ చేశాడు. బుమ్రా వేసిన బంతి వోక్స్ బ్యాట్ ను చుంబిస్తూ వికెట్ కీపర్ పంత్ చేతుల్లోకి వెళ్లింది.  ఆ రకంగా బుమ్రా వరుసగా మూడు వికెట్లు తీశాడు. బట్లర్ తన టెస్టు కెరీర్ లో తొలి సెంచరీ చేశాడు. స్టోక్స్ 187 బంతుల సుదీర్ఘమైన బ్యాటింగ్ లో 62 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగులో రాహుల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. దాంతో ఇంగ్లాండు 241 పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

మూడో టెస్టు మ్యాచు రెండో ఇన్నింగ్సులో భారత బౌలర్లను స్టోక్స్, బట్లర్ జోడీ ధీటుగా ఎదుర్కుంటోంది. వారిద్దరు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. టీ విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా చూసుకున్నారు. దాంతో ఇంగ్లాండు టీ విరామ సమయానికి 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. వారిద్దరు 27 ఓవర్లలో 89 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జోస్ బట్లర్ తన టెస్టు కెరీర్ లో 9వ ఆర్థ సెంచరీ చేసాడు. 

ఆతిథ్య ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సీరీస్ లో మొదటిసారి టీం ఇండియా విజయం దిశగా అడుగులేస్తోంది. మొదటి రెండు మ్యాచుల్లో పరాజయాన్ని చవిచూసిన భాతర జట్టు నిర్ణయాత్మక మూడో టెస్ట్ లో విజృభించింది. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో రాణిస్తూ విజయానికి మరో ఆరు వికెట్ల దూరంలో నిలిచింది. 

ఓవర్ నైట్ స్కోరు 23 పరుగులతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టుకు ఆరంభంలోనే భారత ఫేసర్లు షాకిచ్చారు. ఓపెనర్లు ఆలిస్టర్ కుక్(17), కీటన్ జెన్నింంగ్స్(13) లను బౌలర్ ఇషాంత్ శర్మ పెవిలియన్ బాట పట్టించాడు. కేవలం ఐదు పరుగుల తేడాతో ఇద్దరిని ఔట్ చేసి భారత శిబిరంలో ఉత్సాహాన్ని నింపాడు. ఆ తర్వాత బుమ్రా వేసిన 25వ ఓవర్లో జోరూట్(13) పరుగులు చేసి జౌటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే పోప్ కూడా క్యాచ్ రూపంలో వెనుదిరగడంతో ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. 

521 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఇంకా 428 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ విజయానికి ఇంకా ఆరు వికెట్లు లభిస్తే చాలు. ప్రస్తుతం ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ బట్లర్(19), స్టోక్స్(3) క్రీజులో ఉన్నారు.   ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది.