లండన్: రెండో టెస్టు మ్యాచులో భారత్ ఇంగ్లాండుపై తొలి టెస్టులో కన్నా రెండో టెస్టు మ్యాచులో మరింత చిత్తుగా ఓడిపోయింది. ఇన్నింగ్సు 159 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లాండు బౌలర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ బంతులకు భారత బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు.  దీంతో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ లో ఇంగ్లాండు 2-0 స్కోరుతో ముందంజలో ఉంది.

వరుణదేవుడు కూడా భారత్ ను కాపాడలేకపోయాడు. రెండు సార్లు వర్షం అంతరాయం కలిగించినా ఓటమి నుంచి భారత్ బయటపడలేకపోయింది.  రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 82.2 ఓవర్లు మాత్రమే భారత్ ఆడింది. కనీసం ఒక్కసారైనా 150  పరుగులు చేయలేకపోయింది.
 
ఆండర్సన్‌ (4/23), బ్రాడ్‌ (4/44) కత్తుల్లా బంతులు విసిరారు. దాంతో భారత్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. 289 పరుగులు వెనకబడిన స్థితిలో ఆదివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ 47 ఓవర్లలో 130 పరుగులకు చేతులెత్తేసింది.  తొలి ఇన్నింగ్స్‌ లో లాగే ఈసారి కూడా అశ్విన్‌ (48 బంతుల్లో 5 ఫోర్లతో 33 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. వోక్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. 

అంతకుముందు ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను 88.1 ఓవర్లలో 396/7 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. వోక్స్‌ (252 బంతుల్లో 21 ఫోర్లతో 137 నాటౌట్‌) అజేయంగా నిలిచాడు. కర్రాన్‌ (40) వేగంగా ఆడాడు. షమి, పాండ్యా మూడేసి వికెట్లు తీశారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు వోక్స్‌కు దక్కింది.
 
రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ ఆటతీరు మూడో రోజులాగే సాగింది. ఆండర్సన్‌ ధాటికి మరోసారి భారత ఓపెనర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్‌ బాట పట్టారు.  మురళీ విజయ్ రెండు ఇన్నింగ్స్‌లోనూ అతడు సున్నా పరుగులకే అవుటయ్యాడు.  రెండు ఫోర్లతో టచ్‌లో ఉన్నట్టు కనిపించిన రాహుల్‌ (10) కూడా ఆండర్సన్‌ బౌలింగ్‌లోనే ఎల్బీ అయ్యాడు. 

ఆ స్థితిలో కోహ్లీ కాకుండా రహానె బరిలోకి దిగాడు. మూడో రోజు ఆటలో వెన్నునొప్పి కారణంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 37 నిమిషాలపాటు మైదానం వీడాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ ఓపెనర్లు అంత సమయం కూడా క్రీజులో లేకపోవడంతో అతడు మూడో స్థానంలో రాలేదు. తొమ్మిది ఓవర్లలో 17/2 స్కోరు వద్ద భారీ వర్షం కురవడంతో గంటన్నర మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. 
 
రెండో సెషన్‌ ఆరంభంలో పుజారా (87 బంతుల్లో 1 ఫోర్‌తో 17), రహానె (13) కలిసి 11 ఓవర్ల పాటు ఇంగ్లండ్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కున్నారు. కానీ బ్రాడ్‌ వేసిన 19వ ఓవర్‌లో రహానె పేలవమైన షాట్‌ ఆడి మూడో స్లిప్‌లో జెన్నింగ్స్‌కు దొరికిపోయాడు. పుజారా మాత్రం అద్భుత డిఫెన్స్‌తో బౌలర్లను విసిగిస్తూ  69 బంతులను ఎదుర్కున్నాడు. తర్వాత మిడా్‌ఫలో తొలి బౌండరీని సాధించాడు. వెన్నునొప్పితో అసౌకర్యంగా కనిపించిన కోహ్లీ కొన్ని అద్భుత షాట్లు ఆడాడు. పుజారాను ఇన్‌స్వింగర్‌తో క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. 
 
పుజారా వెనుదిరిగిన కొద్దిసేపటికే కెప్టెన్‌ కోహ్లీ కూడా పెవిలియన్‌కు చేరాడు. మూడు రివ్యూలు తీసుకున్న కొహ్లీ మూడో రివ్యూకి అవుటైనట్లు తేలింది.  నాలుగో బంతికే దినేశ్‌ కార్తీక్‌ స్పష్టం గా ఎల్బీ అయ్యాడు. దీంతో 61 పరుగులకు జట్టు ఆరు వికెట్లు కోల్పో యింది. మరో ఓవర్‌ తర్వాత రెండోసారి వర్షం పడడంతో టీ విరామాన్ని ప్రకటించారు.
 
టీ బ్రేక్‌ తర్వాత భారత బ్యాటింగ్‌లో కాస్తా దూకుడు కనిపించింది. అశ్విన్‌, పాండ్యా (26) ఇద్దరూ ఓవర్‌కో బౌండరీ చొప్పున బాదడంతో స్కోరులో వేగం పెరిగింది. అశ్విన్‌ మంచి టెక్నిక్‌ ను కనబరుస్తూ ఎదురుదాడికి దిగాడు. వీరిద్దరు ఈ మ్యాచ్‌లో తొలిసారిగా 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మరో నాలుగు పరుగుల తర్వాత పాండ్యాను వోక్స్‌ ఎల్బీ చేశాడు. ఇక తొమ్మిది పరుగుల తేడాతో చివరి 3 వికెట్లను కోల్పోవడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ఓటమి ఖాయమైంది.
 
స్కోరుబోర్డు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 107
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 396/7 డిక్లేర్‌