Asianet News TeluguAsianet News Telugu

కామన్వెల్త్ గేమ్స్ 2026 పోటీలపై నీలినీడలు! అంత ఖర్చు పెట్టలేమంటూ చేతులు ఎత్తేసిన విక్టోరియా...

షెడ్యూల్ ప్రకారం ఆస్ట్రేలియాలోని విక్టోరియా వేదికగా జరగాల్సిన 2026 కామన్వెల్త్ గేమ్స్‌... 2 బిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్ల నుంచి 7 బిలియన్లకు పెరిగిన వ్యయం.. 

Doubts on Commonwealth Games 2026, Australia Victoria pulls out as host CRA
Author
First Published Jul 18, 2023, 12:56 PM IST

కామన్వెల్త్ గేమ్స్ 2026 పోటీలపై నీలినీడలు కమ్ముకున్నాయి. షెడ్యూల్ ప్రకారం 2026 కామన్వెల్త్ గేమ్స్‌కి ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం వేదిక ఇవ్వాల్సింది. అయితే అంచనా వేసిన వ్యయం, మూడింతలకు పైగా పెరిగి పోవడంతో కామన్వెల్త్ గేమ్స్‌ని నిర్వహించలేమని తేల్చి చెప్పేసింది విక్టోరియా..

తొలుత కామన్వెల్త్ గేమ్స్ 2026 నిర్వహణకు 2 బిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం లక్షా 12 వేల కోట్ల రూపాయలు) ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయితే ఇప్పుడు ఆ వ్యయం కాస్తా 7 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లకు చేరింది. అంటే మూడున్నర రెట్లు పెరిగిపోయింది..

‘ఓ క్రీడా ఈవెంట్ కోసం 7 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం 3 లక్షల 72 వేల కోట్ల రూపాయలకు పైగా) ఖర్చు చేయడం అనవసరం అని మాకు అనిపిస్తోంది. ఎన్నో చర్చలు, మరెన్నో సమావేశాల తర్వాత ఈ కష్టమైన నిర్ణయం తీసుకుంటున్నాం.. 

కామన్వెల్త్ గేమ్స్‌ 2026 గేమ్స్‌ని నిర్వహించమని సగర్వంగా చెప్పుకోవడానికి ఆసుపత్రుల నుంచి, స్కూల్స్ నుంచి డబ్బులు తీసుకోలేము. అనుకున్న బడ్జెట్ కంటే మూడు రెట్లు ఖర్చు పెరిగిపోయింద. 2026 కామన్వెల్త్ గేమ్స్‌కి విక్టోరియా ఆతిథ్యం ఇవ్వదు. ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్ అధికారులకు ఈ విషయం చెప్పాం. కాంట్రాక్ట్‌ని రద్దు చేయాల్సిందిగా కోరాం...’ అంటూ మెల్‌బోర్న్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో తెలియచేశాడు విక్టోరీయా స్టేట్ ప్రీమియర్ డానియల్ ఆండ్రూస్..

కామన్వెల్త్ గేమ్స్ 2026 పోటీల్లో 20 ప్రధాన క్రీడలు, మరో 26 పోటీలను విక్టోరీయాలోని గీలాంగ్, బల్లారత్, బెండిగో, గిప్స్‌లాండ్, షెప్పర్టన్‌లలో నిర్వహించాలని భావించారు. ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ హబ్స్‌లో కాకుండా కేవలం మెల్‌బోర్న్‌లోనే పోటీలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే కోణంలో కూడా ప్రయత్నాలు జరిగాయి..

అయితే ఏదీ వర్కవుట్ కాకపోవడంతో క్రీడలను రద్దు చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే విక్టోరియా స్టేట్ తీసుకున్న నిర్ణయంపై కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. 

కామన్వెల్త్ గేమ్స్‌లో 54 బ్రిటిష్ పాలిత దేశాల నుంచి దాదాపు 4 వేల మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. 2018లో గోల్డ్ కోస్ట్‌లో 2022లో బర్మింగ్‌హమ్‌లో కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌ని కూడా చేర్చారు. 14 నెలల క్రితం కామన్వెల్త్ గేమ్స్ 2026 ఆతిథ్య హక్కులను తీసుకున్న విక్టోరియా, ఈ పోటీల్లో మరిన్ని పోటీలను జత చేయబోతున్నట్టు ప్రకటించింది. అయితే ఇప్పుడు ఖర్చు భరించలేమంటూ ఆతిథ్య హక్కుల నుంచి తప్పుకుంది..

కామన్వెల్త్ గేమ్స్ 2026 నిర్వహణకు ఎవ్వరూ ముందుకు రాకపోతే ఈ పోటీలు రద్దు అయ్యే ప్రమాదం ఉంది. ఇది కొన్ని వేల మంది అథ్లెట్ల ఆశలపై నీళ్లు చల్లుతుంది. విక్టోరియా ప్రభుత్వం తీసుకున్న  నిర్ణయంపై ప్రతిపక్షలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయం విక్టోరియా పరువు తీసేలా ఉందని, కామన్వెల్త్ గేమ్స్‌కి ఆతిథ్య ఇచ్చే అద్భుత అవకాశాన్ని వదులుకోవడం అధికార పక్షం చేతకానితనానికి నిదర్శనమంటూ దుయ్యపడుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios