నిషేధ ఉత్ప్రేరకాల వాడకం.. భారత డిస్కస్ త్రో ప్లేయర్‌పై మూడేండ్ల నిషేధం..
kamalpreet kaur: భారత అథ్లెట్ కమల్ ప్రీత్ కౌర్ పై అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) కఠిన చర్యలకు దిగింది. నిషేధ ఉత్ప్రేరకాలు వాడినందుకు గాను ఆమెపై మూడేండ్ల నిషేధం విధించింది.
ఇటీవల అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న డిస్కస్ త్రోయర్ కమల్ ప్రీత్ కౌర్ కు అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ షాకిచ్చింది. ఆమెపై మూడేండ్ల నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధ ఉత్ప్రేరకరం స్టానొజొలోల్ వాడినందుకు గాను ఆమె నిషేధానికి గురైంది. ఈ ఏడాది మార్చి 29 నుంచి ఆమెపై నిషేధం అమలులోకి వచ్చింది.
ఈ ఏడాది మార్చి 7న ఆమె తన రక్త నమూనాలను ఏఐయూలో అందజేసింది. ఇందుకు సంబంధించి చేసిన పరీక్షలలో కమల్ ప్రీత్ కౌర్ పాజిటివ్ గా తేలింది. దీంతో విచారణ చేపట్టిన ఏఐయూ.. నేరం రుజువు కావడంతో ఆమెపై కఠిన చర్యలకు దిగింది. ప్రపంచ అథ్లెటిక్స్ ప్రకారం స్టానొజొలోల్ అనేది నిషేధ ఉత్ప్రేరకం.
ఇదే విషయమై ఏఐయూ ఓ ప్రకటన ద్వారా స్పందిస్తూ.. ‘కమల్ ప్రీత్ కౌర్ నిషేధ ఉత్ప్రేరకాలు వాడినందుకు గాను ఆమెపై మూడేండ్ల నిషేధం విధిస్తున్నాం. మార్చి 29, 2022 నుంచి నిషేధం అమల్లోకి వచ్చింది’ అని తెలిపింది.
టోక్యో గేమ్స్ లో కమల్ ప్రీత్ కౌర్.. ఆరో స్థానంలో నిలిచింది. గతేడాది టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్ లో ఆమె 65.06 మీటర్ల దూరం విసిరి నేషనల్ బెస్ట్ రికార్డు నమోదు చేసింది. టాప్-10 లో ఆరో స్థానం దక్కించుకున్న కమల్ ప్రీత్ కౌర్.. జాతీయ స్థాయిలో అదరగొడుతున్నది. ఇప్పుడు ఆమెపై నిషేధం విధించడంతో 26 ఏండ్ల కమల్ ప్రీత్ కెరీర్ అంధకారంలో పడింది. నిషేధం ముగిసిన తర్వాత ఆమె తిరిగి ఈ ఆటలో కొనసాగగలదా..? మునపటి ఆటను ఆడగలదా.?? అనేది సమాధానం దొరకని ప్రశ్నలు.