మహేంద్ర సింగ్ ధోని...భారత క్రికెట్ జట్టులో కీలకమైన ఆటగాడిగా ఓ వెలుగు వెలిగిన ఆటగాడు. తన ధనా ధన్ షాట్లతో పాటు ఎవరికి అందని ఎత్తుగడలతో ఓ వైపు బ్యాట్ మెన్‌గా, మరోవైపు సారథిగా టీంఇండియాకు అనేక మరుపురాని విజయాలు సాధించిపెట్టాడు. అయితే అతడు గత కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోవడంతో తీవ్ర విమర్శలపాలయ్యాడు. ఓ సందర్భంలో ధోనిని జట్టులోంచి తొలగించాలన్న డిమాండ్ మరీ ఎక్కువయ్యింది. ఇలా గడ్డుకాలాన్ని ఎదుర్కొన్న ధోనీ ఆస్ట్రేలియా వన్డే సీరిస్‌లో తన ఆటలో పదునెంతో మరోసారి నిరూపించి తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టాడు. ఇలావిమర్శకుల నోళ్లు మూయించి గతంలో మాదిరిగానే అభిమానులకు తన ఆటతోనే చేరువయ్యాడు.  

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సీరిస్ లో రాణించిన ధోని టీంఇండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇలా తమకు ఇష్టమైన ఆటగాడు చాలారోజుల తర్వాత విజృంభించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే  ఐసిసి(ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) కూడా ధోనికి అరుదైన గౌరవం అందించడంతో ఆ ఆనందం రెట్టింపయ్యింది. 

ఐసిసి అధికారిక ట్విట్టర్ అకౌంట్ కవర్ పేజీపై ధోని ఫోటోను పెట్టింది.చాలా రోజుల తర్వాత విన్నింగ్ ఇన్సింగ్స్ ఆడిన ధోనికి గౌరవంగా అతడి ఫోటోను ఐసిసి కవర్ పేజిపై పెట్టింది. దీంతో టీంఇండియా ఆటగాళ్లతో పాటు ధోని అభిమానులు, క్రికెట్ ప్రియుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఐసిసి మాదిరిగానే విమర్శకులు  కూడా ధోని ఆటతీరేంటో గుర్తించాలని...అతడి ఆటలో పస తగ్గలేదంటూ కామెంట్ చేస్తున్నారు. 

2018 సంవత్సరంలో 20 వన్డే మ్యాచులాడిన ధోని ఒక్కటంటే ఒక్క అర్థశతకాన్ని సాధించలేకపోయాడు. దీంతో అతడి వయసు పెరగడంతో ఆటలో పదును తగ్గిందని..వెంటనే అతడు రిటైరయితే మంచిదని కొందరు విమర్శలకు దిగారు. వీరి విమర్శలకు తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాలని భావించిన ధోని...ఆస్ట్రేలియా  వన్డే సీరిస్ లో ఆ పని చేశాడు. మూడు వన్డేల్లో వరుసగా 51, 55నాటౌట్,  87 నాటౌట్ పరుగులతో హ్యాట్రిక్ అర్థశతకాలు సాధించాడు. ఇలా ఆ ఏడాది ఆరంభంలోనే ఇతడు ఇంతలా రెచ్చిపోతే తర్వాత జరిగే ప్రపంచ కప్ లో ధోని విశ్వరూపం చూడవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.