CWG 2022: ఆటలకోసం వచ్చి అదృష్యమైన లంక అథ్లెట్లు.. దేశ ఆర్థిక దుస్థితికి నిదర్శనం
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా మిగిలిన సభ్య దేశాలతో పాటే శ్రీలంక కూడా బర్మింగ్‌హామ్ కు వెళ్లింది. కానీ పలువురు అథ్లెట్లు మాత్రం తిరిగి లంకకు చేరలేదు.
గతనెల 28 న యూకేలోని బర్మింగ్‌హామ్ వేదికగా మొదలైన కామన్వెల్త్ క్రీడల కోసం 71 దేశాలతో (మొత్తం 72 దేశాలు పాల్గొన్నాయి) పాటు శ్రీలంక కూడా పాల్గొంది. ఈసారి కామన్వెల్త్ లో వివిధ క్రీడాంశాల్లో పాల్గొనేందుకు గాను లంక.. 110 మంది (50 మంది పురుషులు, 60 మంది మహిళలు) తో కూడిన అథ్లెట్ల బృందాన్ని బర్మింగ్‌హామ్‌కు పంపింది. ఆటలు జరుగుతున్న క్రమంలో లంకకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఆ దేశానికి చెందిన పలువురు ఆటగాళ్లు కనబడకుండా పోయారు. ఏదో ఒకరిద్దరు అనుకుంటే పొరపాటే. ఏకంగా లంకకు చెందిన 10 మంది క్రీడాకారుల జాడ దొరకలేదు. అథ్లెట్లతో పాటు పలువురు అధికారులు కూడా తప్పిపోయారని తెలుస్తున్నది.
బర్మింగ్‌హామ్ కు వెళ్లిన 110 మందిలో ఒక రెజ్లర్, జూడోక, జూడో కోచ్ తో పాటు ఏడుగురు అథ్లెట్లు కూడా తప్పిపోయారట. 110 మంది క్రీడాకారులు, 51 మంది అఫిషీయల్స్ తో కూడిన బృందంలో పది మంది దాకా తప్పిపోవడంతో బర్మింగ్‌హామ్ లో లంక బృందం లెక్కతప్పింది.
ఆటల కోసమని వచ్చిన ఆటగాళ్లలో మిస్ అయినవాళ్లు తమ బ్యాగులను క్రీడాగ్రామంలోనే వదిలి అక్కడ్నుంచి మిస్ అయ్యారు. వీళ్లకు ఆరునెలల పాటు వీసాలున్నాయని తెలుస్తున్నది. అయితే అదృష్యమైన తొలి ముగ్గురు అథ్లెట్లను బర్మింగ్‌హామ్ పోలీసులు వెతికి పట్టుకున్నారని, కానీ వాళ్లను ఎక్కడ ఉంచింది మాత్రం వెల్లడించలేదని లంక ప్రతినిధులు తెలిపారు.
లంకలో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులున్నాయి. ఇప్పటికే ఆ దేశంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఒక్కపూట తిండి దొరికినా అదే మహాభాగ్యం అన్నట్టుగా తయారైంది అక్కడ పరిస్థితి. నిత్యావసరాల ధరలు కొండెక్కాయి. లీటర్ పాలు, కూరగాయలు, బియ్యం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తున్నది. ధనవంతులు, పేదవాళ్లు అనే తేడా లేకుండా ప్రజలంతా పస్తులుండాల్సి వస్తున్నది.
దీంతో బర్మింగ్‌హామ్ కు వెళ్లిన లంక అథ్లెట్లు కూడా ఇదే కారణంతో అక్కడ ఆగిపోయి ఉంటారని.. స్వదేశానికి వెళ్లి తిండి తిప్పలు మాని అల్లాడటం కంటే యూకేలోని ఆగిపోయి ఏదో ఒక పని చేసుకుని బతకడం బెటరనే అభిప్రాయంలో వాళ్లు ఉన్నట్టు తెలుస్తున్నది. మరి అదృష్యమైన క్రీడాకారుల ఆచూకీ ఎక్కడుంది..? అనేది ఎప్పుడు తేలనుందో..
ఇక ఈ క్రీడలలో శ్రీలంక.. ఒక రజతం, మూడు కాంస్యాలతో మొత్తంగా 4 పతకాలు సాధించింది. పతకాల పట్టికలో ఆ దేశం 31వ స్థానంలో నిలిచింది.