Viral Video: విరాట్‌ కోహ్లీపై కమ్మిన్స్‌ సెటైర్లు.. టీమిండియా ఫ్యాన్స్‌ రియాక్షన్‌ ఏంటంటే..

2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి సమయం దగ్గరపడుతోంది. దీంతో క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ పై మరింత క్యూరియాసిటీ పెంచే క్రమంలో విడుదల చేసిన ఓ ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.. 

Cummins Trolls Kohli in Champions Trophy 2025 Ad VNR

2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సంస్థ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇందులో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ విరాట్ కోహ్లీతో సహా తన ప్రత్యర్థి ఆటగాళ్లను హాస్యభరితంగా ఆటపట్టించాడు. ఇప్పుడీ వీడియో 2025 ఛాంపియన్స్ ట్రోఫీపై అంచనాలను పెంచేసింది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. 

50 ఓవర్ల టోర్నమెంట్ పట్ల ఉత్సాహాన్ని పెంచడానికి అనేక ప్రమోషన్లు, ప్రకటనలు రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ పాకిస్థాన్ లో జరగాల్సి ఉండగా భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో బీసీసీఐ టీమిండియాను పాకిస్థాన్ కు పంపడానికి నిరాకరించింది. దీంతో ఈ టోర్నమెంట్ ను హైబ్రిడ్ మోడల్ లో తీసుకొస్తున్నారు. ఈ కారణంగా భారతదేశం ఆడే మ్యాచ్ లకు దుబాయ్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజా ప్రైమ్ వీడియో రూపొందించిన ప్రకటనలో కమిన్స్ ఫన్నీ కామెంట్స్ చేశాడు. 

అద్దంలో చూసుకుంటూ షేవింగ్ చేసుకుంటున్నట్లు ఉన్న ఈ వీడియో ప్లేయర్స్ ని ఎలా దృష్టి మరల్చాలన్న దాని గురించి ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపించాడు. ఇందులో భాగంగానే బెన్ స్టోక్స్, ఆలీ పోప్, విరాట్ కోహ్లీ, క్వింటన్ డికాక్‌లకు ఉద్దేశించి సెటైరికల్ కామెంట్స్ చేశాడు. విరాట్ కోహ్లినీ ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. 'హే కోహ్లీ, నువ్వు ఇంత నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం నేను ఎప్పుడూ చూడలేదు' అని కామెంట్స్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. టీమిండియా అభిమానులు మాత్రం ఈసారి కోహ్లీ తగ్గేదేలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

వీడియో ఇక్కడ చూడండి 

ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ, పాట్ కమిన్స్ అన్ని ఫార్మాట్లలో చాలాసార్లు మైదానంలో తలపడ్డారు. ఈ ఇద్దరూ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఒకరికొకరు ఎదురయ్యారు. 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో, పాట్ కమిన్స్ విరాట్ కోహ్లీ కీలకమైన వికెట్ తీసుకున్నాడు, ఇది ఆస్ట్రేలియాకు ఆటను మలుపు తిప్పింది. కోహ్లీ తన అర్ధ సెంచరీ పూర్తి చేసిన తర్వాత మంచి ఫామ్ లో కనిపించాడు. అయితే ఈదే సమయంలో కోహ్లి వెనుతిరగడంతో టీమిండియా బ్యాటింగ్ లో వేగం తగ్గింది. 

పాట్ కమిన్స్, విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో 40 ఇన్నింగ్స్‌లలో ఒకరికొకరు తలపడ్డారు, ఆస్ట్రేలియా కెప్టెన్ కోహ్లీని ఇప్పటి వరకు 8 సార్లు అవుట్ చేశాడు. అయితే కోహ్లీ మొత్తం 40 ఇన్నింగ్స్‌లలో 41.8 సగటుతో 335 పరుగులు చేయడం విశేషం. కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా ఒకే గ్రూపులో లేవు, కానీ ఈ రెండు జట్లు టోర్నమెంట్ నాకౌట్ రౌండ్స్ లో కలుసుకునే అవకాశం ఉంది. కాగా కమిన్స్ ప్రస్తుతం చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. 

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత నొప్పి మరింత ఎక్కువైంది. అయినా అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టులో చేర్చడం గమనార్హం. ఇక కోహ్లి ఛాంపియన్స్ ట్రోఫీలో భారతదేశానికి నాల్గవ అత్యధిక పరుగుల స్కోరర్ గా నిలిచాడు. 13 మ్యాచ్‌లలో 88.16 సగటుతో ఐదు అర్ధ సెంచరీలతో సహా 529 పరుగులు చేశాడు. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios