కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ముమ్మరంగా చర్యలు ప్రారంభించాయి. లాక్‌డౌన్‌లు, సరిహద్దుల మూసివేతతో పాటు వైద్య సదుపాయాలను అందజేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రభుత్వానికి, బాధితులకు అండగా నిలిచేందుకు పలువురు  ప్రముఖులు కూడా ముందుకు  వస్తున్నారు.

ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు కోట్లాది రూపాయల విరాళాలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బ్రిటిష్ ప్రొఫెషనల్ బాక్సర్ అమీర్ ఖాన్ కూడా ఆ జాబితాలోకి చేరారు. లండన్‌లో తనకు చెందిన 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనాన్ని ఆసుపత్రిగా ఇస్తున్నట్లు ప్రకటించాడు.

Also Read:కేంద్ర ప్రభుత్వం చెప్పినా పట్టించుకోరా? అలా చేస్తేనే బావుంటుంది: జగన్ సర్కార్ కు పవన్ సలహా

నేషనల్ హెల్త్ సర్వీస్ అధికారులు ఈ భవనాన్ని ప్రజల కోసం ఉపయోగించుకోవచ్చునని తెలిపాడు. అమీర్ ఖాన్ 2009 నుంచి 2012 మధ్యకాలంలో యూకే తరపున బాక్సర్‌గా ప్రాతినిథ్యం వహించాడు.

వరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడంతో పాటు ఎన్నో టైటిళ్లను గెలిచాడు. యూకేలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఆసుపత్రుల కొరత ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మూడు వారాల పాటు లాక్‌డౌన్ ప్రకటించారు. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాకుండా స్వీయ నిర్బంధాన్ని పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.

Also Read:క‌రోనా పై పోరుకు మేము సైతం.. ప్ర‌భాస్‌, మ‌హేష్ భారీ విరాళాలు

కాగా కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారితో పాటు బాధితులకు స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ అతని భార్య మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లను విరాళంగా ప్రకటించారు. ప్రపంచ మాజీ నెంబర్‌వన్ అయిన ఫెదరర్ ప్రస్తుతం తన కుటుంబంతో గడుపుతున్నాడు.

గత నెలలో అతను మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఫ్రెంచ్ ఓపెన్ వాయిదా వేయడంతో, టెన్నిస్ అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే జూన్ 29 నుంచి ప్రారంభం కానున్న వింబుల్డన్‌లో ఫెదరర్ రాకకోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.